Sri Lanka : శ్రీలంక టూర్ లో టాలెంటెడ్ ప్లేయర్లకు చోటు దక్కలేదా?

Sri Lanka

Sri Lanka vs India

Sri Lanka :  గౌతమ్‌ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా ప్రకటించిన తర్వాత శ్రీలంక టూర్ కు భారత్‌ సిద్ధమవుతున్నది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు పోటీలు జరగనున్నాయి. ఈ పర్యటనకు ప్లేయర్లను ఎంపిక చేశారు. కోచ్‌ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీవ్ర కసరత్తు చేశారు. అనూహ్యమైన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్చపరిచారు. గంభీర్‌ తన ముద్ర వేశాడని కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. ప్రతిభ గల ప్లేయర్లకు అవకాశం కల్పించలేదని మరికొందరు విమర్శిస్తున్నారు .శ్రీలంక పర్యటనకు వెళ్లే ఆటగాళ్ల ఎంపిక విషయంలో కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు ఉన్నాయి.

కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ ఔట్..

రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత తదుపరి కెప్టెన్‌ హార్దిక్  అని అందరూ ఊహించారు.  ప్రపంచ కప్ లోనూ హార్థిక్ రాణించాడు. జట్ల ప్రకటన ముందు వరకు ‘హార్దిక్‌ కెప్టెన్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. కానీ.. సూర్య కుమార్‌ను టీ20ల కెప్టెన్ గా సెలక్షన్‌ కమిటీ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఇది కోచ్‌ గంభీర్‌ ప్రభావమేనని భావిస్తున్నారు.

టీ20లకు కెప్టెన్‌గా సూర్య..

తన వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదని హార్దిక్‌ పాండ్యా ఇప్పటికే సమాచారం ఇచ్చాడు. దీంతో 50 ఓవర్ల క్రికెట్‌లోనూ అతడు కనీసం వైస్‌ కెప్టెన్‌గా నైనా ఉంటాడని భావించినా కుదరలేదు. దీంతో కెప్టెన్సీ గ్రూప్‌ నుంచి హార్దిక్ పాండ్యాను దాదాపు పక్కన పెట్టినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని సూర్యకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

జట్టకు ఎంపికయ్యేది అనుమానమే అనుకుంటే..

గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో శుభ్‌మన్‌ గిల్  ఆటతీరు బాగా లేదు. ఆ తర్వాత గిల్ జట్టులోకి రావడం అనుమానమేనని అనుకున్నారు .వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకోలేకపోయాడు. టీ20 ప్రపంచ కప్‌లో రిజర్వ్‌గా ఎంపికవడం విశేషం. తాజాగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా టీమిండియాకు టైటిల్ అందించాడు. ఆట తీరులో మార్పు లేకున్నా గంభీర్‌ అతనిపై నమ్మకం ఉంచాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో గిల్ కీలకంగా మారడంతోపాటు కెప్టెన్సీ రేసులో ఉంటాడనే అంచనాతో అతనికి వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. పెద్దగా ఆకట్టుకోని గిల్‌ను టీ20ల్లోనూ వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే బ్యాటింగ్‌లో సత్తా చాటితే.. రోహిత్‌, సూర్య తర్వాత జట్టు బాధ్యతను అందుకొనే అవకాశం గిల్‌  కు ఉంది.

రాణించినా అందని అవకాశం..

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ ను  విజేతగా నిలపడంలో కుల్‌దీప్‌ యాదవ్  కీలకంగా వ్యవహరించాడు. కేవలం ఐదు మ్యాచుల్లోనే  పది వికెట్లు తీసి అబ్బురపరిచాడు. అలాంటి ప్లేయర్ కు శ్రీలంక టూర్ లో చోటు దక్కకపోవడం అభిమానులను విస్మయానికి గురి చేస్తున్నది. వన్డేలకు మాత్రమే ఎంపికయ్యాడు. ఇదే జాబితాలో  మంచి ప్లేయర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ఉన్నాడు. ఏషియన్‌ గేమ్స్‌లో టీమిండియాకు స్వర్ణ పతకం సాధించి పెట్టాడు. ఇటీవల జింబాబ్వేపైనా ఠాణించాడు. ఇక మరో బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ జింబాబ్వేపై రికార్డు సెంచరీ నమోదు చేసినా టీ20లకు పక్కన పెట్టారు. ఓపెనర్ల లో తీవ్ర పోటీ ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో రాణించిన పరాగ్‌, రవి బిష్ణోయ్‌పై గంభీర్‌ నమ్మకం ఉంచాడు. ఇషాన్‌ కిషన్‌ దేశవాళీలో ఆడకపోవడం అతడికి ప్రతికూలంగా మారంది.

కోల్‌కతా కుర్రాళ్లకు జై..

కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన  గంభీర్‌.. ఆ జట్టు ప్లేయర్ల ఎంపికకు ప్రాధాన్యమిచ్చాడు. శ్రేయస్‌ అయ్యర్, రింకు సింగ్, హర్షిత్ రాణాలను శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేశాడు. గతంలో కేకేఆర్‌కు ఆడిన సూర్యకుమార్‌  ఏకంగా కెప్టెన్‌ కావడం గమనార్హం. వారి శక్తిసామర్థ్యాలపై అవగాహన ఉన్నందునే గంభీర్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని  క్రికెట్ వర్గాల అభిప్రాయం. తన కోచింగ్ స్టాఫ్‌లోనూ కేకేఆర్‌  జట్టుకు  చెందిన అభిషేక్‌ నాయర్‌ ఉండే అవకాశం ఉంది.

TAGS