JAISW News Telugu

IIT students : ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగాల్లేవ్..తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన

IIT students

IIT students

IIT students : భారత్ లో ఐఐటీలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో చదివితే గొప్ప అవకాశాలు, లక్షల రూపాయల వేతనాలు లభించే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తుంటారు. దేశాభివృద్ధికి ఐఐటీల్లో చదివిన ఇంజినీర్లు ఎంతగానో కృషి చేస్తుంటారు. ఇందులో చదివిన వారికి దేశంలోనే కాదు విదేశాల్లోని ప్రముఖ సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొస్తుంటాయి. ఐఐటీల్లో చదివేందుకు భారతీయ విద్యార్థులు ఐదు, ఆరు తరగతుల్లోనే ఐఐటీ ఫౌండేషన్ ప్రారంభిస్తారు. కఠినమైన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అహర్నిషలు కష్టపడుతుంటారు. అయితే ఐఐటీల్లో చదివిన వారికి తగిన రీతిలో ప్లేస్ మెంట్స్ లభించడం లేదని తెలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో జరిగే ప్లేస్ మెంట్స్ పైనా ప్రభావం చూపుతోంది. ఐఐటీ బాంబే విద్యార్థుల్లో 36 శాతం మంది అభ్యర్థులకు ప్రస్తుత ప్లేస్ మెంట్ సీజన్ లో ఇప్పటివరకూ ఉద్యోగాలు లభించలేదు. 2 వేల మంది ప్లేస్ మెంట్ లో నమోదు చేసుకుంటే వారిలో 712 మందికి ఇప్పటికీ జాబ్ ఆఫర్లు రాకపోవడం గమనార్హం.

పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఐఐటీ బాంబే ప్లేస్ మెంట్స్ లో నమోదు చేసుకున్న సీఎస్ఈ విద్యార్థులకు పూర్తిస్థాయిలో జాబ్ ఆఫర్లు పొందలేకపోవడం ఇదే తొలిసారి. ప్లేస్ మెంట్ డ్రైవ్ లో పాల్గొన్న కంపెనీల్లో 380 దేశీ కంపెనీలు కాగా, అంతర్జాతీయ కంపెనీ సంఖ్య ఈసారి తక్కువగా ఉందని చెబుతున్నారు.

కాగా, ఆర్థిక అనిశ్చితి, ఇతరాత్ర కారణాల వల్ల ఐఐటీ బాంబే నిర్దేశించిన ప్యాకేజీ ఇచ్చేందుకు సంస్థ మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. అయితే ప్లేస్ మెంట్స్ లో పాల్గొనే ముందు దశల్లో ఆయా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల వల్లే కంపెనీలు భారీ వేతనాలు ఇవ్వడం లేదని, పరిస్థితులు సద్దుమణిగాక భారీ వేతనాలు ఆశించవచ్చని అంటున్నారు. ఐఐటీల్లో చదివిన వారికి మంచి అవకాశాలే లభిస్తాయని, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version