Gavaskar Fire : స్టేడియంలో ఆటగాళ్లు తలపడుతుంటే.. కామెంట్రీ బాక్స్ లో ఇరు వైపులా మాజీలు తలపడుతున్నారు. ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా తరుఫున దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ తరుఫున మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. కామెంటరీలో భాగంగా పీటర్సన్ భారత్ స్పిన్ పిచ్‌లపై నోరు జారాడు. దీంతో గవాస్కర్ అతడిపై మండిపడ్డాడు.
సెకండ్ డే చివరి సెషన్ లో ఫస్ట్ డే ఆట గురించి చర్చిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 55/0తో మెరుగ్గా ఉన్న ఇంగ్లాండ్ జడేజా, అశ్విన్ ధాటికి 60/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. దీని గురించి కెవిన్ మాట్లాడుతూ.. ‘జడేజా వేసిన తొలి రెండు బంతుల్ని గమనించారా..? అది టెస్ట్ మొదటి రోజు. ఎంతగా టర్న్ అయ్యాయో చూడండి. ఫస్ట్ డే అంతలా అవకూడదు’ అన్నాడు.
దీనికి గవాస్కర్ బదులిస్తూ.. ‘బంతి స్పిన్ అవుతుందా, బౌన్స్ అవుతుందా చూడకండి. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఔటైన తీరు పరిశీలించండి. మిడాన్ లో క్రాలీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జో రూట్ రివర్స్ స్వీప్ చేసి పెవిలియన్ బాట పట్టాడు. మిగిలిన బ్యాటర్ల టెక్నిక్ అస్సులు బాగోలేదు. అంతగా బౌన్స్, టర్న్ కాలేదు. మీరు భారత్‌లో టెస్ట్ ఆడాలనుకుంటే తొలి రోజు నుంచే టర్న్ అవుతుందని భావించి రావాలి. అంతే కానీ నేరుగా బంతులు వస్తాయని అనుకోవద్దు’ అన్నాడు.
దీంతో పీటర్సన్ తగ్గి.. ‘స్పిన్‌కు అనుకూలమని ఇంగ్లాండ్ కూడా భావించింది. అయితే, 2 జట్ల మధ్య తేడా తమ స్పిన్నర్లు సాధించే స్పిన్’ అన్నాడు. గొప్ప వ్యాఖ్యాతలు కూడా తటస్తంగా ఉంటూ కామెంటరీ చేయడం కష్టమని గవాస్కర్ నవ్వుతూ ఆ చర్చకు ముగింపు పలికాడు. సాధారణంగా వ్యాఖ్యాతలు తటస్థంగా ఉంటూ ఆటను విశ్లేషిస్తుంటారు. కానీ పీటర్సన్ ఇంగ్లాండ్‌కు మద్దతుగా మాట్లాడడంతో, గవాస్కర్ దీటుగా బదులిచ్చి డిబేట్‌కు ఎండ్ కార్డ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 రన్స్ చేయగా, టీమిండియా 436 పరుగులు సాధించింది.