JAISW News Telugu

Medigadda Barrage : మేడిగడ్డ వద్ద నో ఎంట్రీ. ఏమి జరుగుతోంది?

Medigadda Barrage

Medigadda Barrage

Medigadda Barrage : ప్రపంచలోనే అతి గొప్ప ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ఒకటని, అదీ తమ హాయాంలోనే కట్టామని  బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ చెప్తూనే ఉంది. కానీ ఆ ప్రాజెక్టులోని లోపాలు ఒక్కక్కటిగా బయటపడుతున్నాయి. మేడిగడ్డలో పిల్లర్ కుంగిపోవడం పెద్ద దుమారమే లేపింది. ఇటీవల ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు ప్రారంభించగా.. మరిన్ని చోట్ల  కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలుస్తోంది.

దెబ్బతిన్న పిల్లర్లు 20, 21 సమీపంలో పెద్ద గొయ్యి గుర్తించగా, బ్యారేజీ ప్రాంతం అంతటా ఇలాంటి గుంతలు కనిపిస్తున్నాయి. దీనిపై ఎల్ అండ్ టీ స్పందిస్తూ బ్యారేజీ వద్ద గుంతలను గుర్తించిన తరువాత ఎల్ అండ్ టీ ‘నో ఎంట్రీ’ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ బోర్డుతో బ్యారేజీ నిర్మాణ సమగ్రతపై మరిన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఈ నిర్మాణాత్మక వైఫల్యాలను బహిర్గతం చేయకుండా ఉండేందుకు ఎల్ అండ్ టీ ముఖ్యంగా మీడియాకు యాక్సెస్ ను పరిమితం చేస్తున్నట్లు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) వర్షాలు ప్రారంభం కాకముందే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల మరమ్మతు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరమ్మతులు ప్రారంభించాలని ఎల్ అండ్ టీకి సూచించింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం మేడిగడ్డను సందర్శించాలని రేవంత్ ప్లాన్ చేశారు.

కుంగిన పిల్లర్ల వద్ద మరమ్మతులు ప్రారంభించిన కొద్ది సేపటికే పెద్ద గొయ్యి కనిపించడంతో మరిన్ని లోపాలు బయటపడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఎల్ అండ్ టీ సైట్ ప్రాంతానికి ప్రవేశాన్ని పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రాజెక్టులో ఎన్ని లోపాలున్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ఈ మూడు బ్యారేజీల్లో నీటిని ఎత్తిపోయాలని, నీటి నిల్వ వల్ల బ్యారేజీలకు మరింత నష్టం వాటిళ్లే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే నాణ్యత లోపించడం వల్ల ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారి బ్యారేజీలకు అదనపు నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా వందల కోట్లు వెచ్చించి మరమ్మతులు చేసిన బ్యారేజీలు మళ్లీ విఫలమయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం మీద ఎల్ అండ్ టీ సంస్థ మరమ్మతుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 

Exit mobile version