Bathukamma Kunta : బతుకమ్మ కుంటలో కూల్చివేతలు ఉండవు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
Bathukamma Kunta : హైడ్రా విషయంలో ఎటువంటి భయాందోళనలు అక్కర్లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఆక్రమించిన స్థలాల్లో నివాసం ఉన్నప్పటికీ అలాంటి వారిని టచ్ చేయడం లేదని కేవలం ఖాళీగా ప్రాంతాలను పునరుద్ధరిస్తామన్నారు. బుధవారం అంబర్ పేట బతుకమ్మ కుంటను ఆయన సందర్శించారు. బతుకమ్మ కుంట పునరుద్ధరణపై స్థానికులతో రంగనాథ్ చర్చించారు. తమ ఇళ్లను కూలుస్తారా అని ప్రశ్నించగా ఇళ్లు, నివాస స్థలాల జోలికి వెళ్లబోమని కమిషనర్ స్పష్టం చేశారు. 1962 లెక్కల ప్రకారం బతుకమ్మకుంట 16.13 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, కానీ ప్రస్తుతం 5.15 ఎకరాలకు కుచించుకుపోయిందన్నారు. స్థానికుల విజ్ఞప్తితోనే బతుకమ్మ కుంట పునరుద్ధరణకు హైడ్రా నిర్ణయం తీసుకుందన్నారు. రెండు నెలల్లో బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తామన్నారు. హైడ్రా ఎఫెక్టుతో నగరంలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని వస్తున్న ప్రచారంపై స్పందిస్తూ రిజిస్ట్రేషన్లు పెరిగాయని చెప్పడానికి లెక్కలు కూడా ఉన్నాయన్నారు. అన్ని పార్టీల నేతలు కూడా బతుకమ్మ కుంట పునరుద్ధరణ కోసం నన్ను కలిశారని, త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయన్నారు. అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించామన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.