Minister Kandula Durgesh : దేశంలో మూడో అతిపెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రంలో రుషికొండ మాత్రమే బ్లూఫ్లాగ్ బీచ్ గా ఎంపికౌందని, కాకినాడ, సూర్యలంక, మైపాడు, రామాపురం బీచ్ లకు కూడా ఆ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. 2025-30 కాలానికి కొత్త పర్యాటక విధానం 2025 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుందని, తద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం పునర్‌వైభవం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విశాఖ జోన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘టూరిజం, ట్రావెల్ సమిట్’కు ఆయన హాజరై మాట్లాడారు. పర్యాటకాభివృద్ధికి కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకొస్తే ప్రభుత్వపరంగా రాయితీలు కల్పిస్తామన్నారు. పర్యాటక రంగం ద్వారా మొత్తం ఉపాధి కల్పనలో 20% ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జనవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, రాష్ట్రంలో చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సినీ పరిశ్రమ పెద్దలతో విజయవాడలో సమావేశమై చర్చిస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సురేశ్ ప్రొడక్షన్స్ సీఈవో దగ్గుబాటి సురేశ్ బాబు, సీఐఐ ఏపీ ఛైర్మన్ డాక్టర్ వి.మురళీకృష్ణ, ఎంపీ శ్రీభరత్, సీఐఐ ప్రతినిధులు బి.శ్రీనివాస్ సతీష్, గ్రంథి రాజేశ్, రాజా ఇందుకూరి తదితరులు పాల్గొన్నారు.