JAISW News Telugu

CM Revanth : టీ కాంగ్రెస్ కు కొత్త కష్టాలు.. రేవంత్ ఎలా ఎదుర్కొంటారో?

New difficulties for Telangana Congress

New difficulties for Telangana Congress

CM Revanth : బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారెంటీల పేరుతో జనాల్లోకి వెళ్లిన ఆ పార్టీ ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోంది. త్వరలోనే రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో జరుగబోయే లోక్ సభ ఎన్నికలకు ముందే వీటిని అమలు చేయనుంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన హామీల ప్రకారం.. పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై ప్రజలు ఆశలు పెట్టుకోవడంతో పాటు.. పార్టీలో ఎన్నో ఏండ్లుగా  ఎంతో మంది నాయకులు, నేతలు కూడా ఆశలు పెంచుకున్నారు. పార్టీ అధికారంలో లేకున్నా పార్టీనే అట్టిపెట్టుకుని కొందరు ఆర్థికంగా చితికిపోయారు. పార్టీకి కమిట్ మెంట్ తో పనిచేశారు. అయితే వీరిలో ఎంతో మంది ఎమ్మెల్యే సీట్లను ఆశించారు.

ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో.. కొందరికీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నారు. మరికొంత మందికి నామినేట్ పదవులు అప్పగించే పనిలో రాష్ట్ర నాయకత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 57 కార్పొరేషన్ పదవులను ఇటీవల రద్దు చేసింది. వీటిలో కాంగ్రెస్ నేతలు, నాయకులకు బాధ్యతలు అప్పజెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు.

అయితే 57 కార్పొరేషన్ పదవుల కోసం వందల్లో ఆశావహుల ఎదురుచూడడం రేవంత్ సర్కార్ కు ఇబ్బందే. పదేళ్ల నుంచి ఏ పదవి లేకుండా జేబులోంచి ఖర్చులు పెట్టుకున్న నాయకులకు కొద్దిగా రిలీఫ్ ఇవ్వాలంటే నామినేటెడ్ పదవులు అవసరం. అయితే పోటీ తీవ్రంగా ఉండడంతో రేవంత్ ఏం చేస్తారు అన్నదానిపై పోటీదారులు ఉత్కంఠ గా ఉన్నారు.

అన్వేష్ రెడ్డి, ప్రీతమ్, బెల్లయ్య నాయక్, మెట్టు సాయి, నూతి శ్రీకాంత్ గౌడ్, వేణుగోపాల్ రావు, చరణ్ కౌశిక్ యాదవ్, భవాని రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి,  వెన్నం శ్రీకాంత్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, కైలాశ్ నేత, లోకేశ్ యాదవ్, కె. శ్రీకాంత్ యాదవ్, సీహెచ్. వెంకటేశ్.. లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది నామినేట్ పదవుల కోసం ఆశలు పెంచుకున్నారు. పదుల్లో ఉన్న పోస్టులకు వందల్లో ఆశావహులు ఉండడంతో వీరిని ఎలా సర్దుబాటు చేస్తారు? పదవులు రానివారిని ఎలా బుజ్జగిస్తారు? అనే దానిపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.

Exit mobile version