Arjun Ram Meghwal : భారతీయ శిక్షాస్మృతి (1860), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872), క్రమినిల్ ప్రొసీజర్ కోడ్ (1973) వంటి చట్టాల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన నేర చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ మూడు చట్టాల్లో పలు నూతన విధానాలను ప్రవేశపెట్టినట్లుగా ఆయన తెలిపారు.
వీటిపై బ్యూరో ఆఫ్పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (బీపీఆర్ డీ), జ్యుడీషియల్ అకాడమీలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అధికారులకు శిక్షణ ఇస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని నేర న్యాయవ్యవస్థకు ఈ మూడు చట్టాలు కీలకమైనవని మంత్రి వ్యాఖ్యానించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అనే మూడు కొత్త చట్టాలను గత ఏడాది పార్లమెంటు ఆమోదించగా 2023 డిసెంబర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. భారతీయ న్యాయ సంహిత వేర్పాటువాద చర్యలు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, దేశద్రోహం వంటి నేరాలకు విధించే శిక్షల గురించి తెలుపుతుంది.