T20 World Cup : అహంకారానికి.. అభిమానానికి తేడా ఇదే.. ఆస్ట్రేలియా టీమ్ ను ఎత్తిపొడుస్తున్న నెటిజన్లు
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్వదేశానికి వచ్చిన భారత జట్టుకు లభించిన ఘన స్వాగతాన్ని చూసి క్రీడా ప్రపంచం ఆశ్చర్యపోయింది. ముంబై, ఢిల్లీలో టీమిండియా ప్లేయర్లను స్వాగతించిన తీరు అమోఘం. దేశ ప్రధాని నుంచి మొదలుకొని సాధారణ వ్యక్తి కూడా టీమిండియా ప్లేయర్లను ప్రశంసిస్తూ తమ గుండెల్లో దాచుకుంటున్నారు. ఒక దేశం క్రికెట్ ఆరాధిస్తే ఇంతలా ఉంటుందా అని ప్రపంచం సైతం ఆశ్చర్యపోతున్నది.
17 ఏళ్ల నిరీక్షణ అనంతరం టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ను రెండో సారి కైవసం చేసుకుంది. 2007లో ధోని కెప్టెన్సీలో తొలి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన టీమిండియా.. మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు రెండో సారి మినీ ప్రపంచ కప్‌ను చేజిక్కించుకుంది. జూన్ 29న బార్బోడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో రోహిత్ సేన టైటిల్ దక్కించుకొని.. విశ్వవిజేతగా నిలిచింది. అయితే.. ఫైనల్ తర్వాత వెస్టిండీస్ లో హరికేన్ తుపాను రావడంతో.. టీమిండియా ప్లేయర్లు స్వదేశానికి రావడంలో కొంత ఆలస్యమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీమిండియా ప్లేయర్లు గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి అడుగడుగునా నీరాజనాలతో కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం అందుకున్నారు.
ఆస్ట్రేలియాను ఆడుకుంటున్న నెటిజన్లు..
విశ్వవిజేతగా నిలిచిన అనంతరం టీమిండియా ప్లేయర్లు స్వదేశానికి వచ్చిన అనంతరం వారు మరింత అణుకువగా నడుచుకోవడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ గర్వం ఏ మాత్రం లేకుండా నడుచుకోవడం టీమిండియా ప్లేయర్లకే సాధ్యం అంటూ కొనియాడుతున్నారు. ఇదే సమయంలో ఆస్ర్టేలియా టీమ్ ను ఆడేసుకుంటున్నారు. గత ఏడాది నవంబర్ లో ప్రపంచకప్ ఫైనల్ లో గెలిచిన ఆస్ర్టేలియా జట్టు నానా రభస చేసింది. కప్పు గెలిచిన రోజు రాత్రి తాగి తందానాలాడారు. షాంపెన్‌తో జలకాలాడారు. వారు బస చేసిన హోటల్ గదుల్లో చేసి ఎంజాయ్ మాములుగా లేదు.
ఇక ఆ సమయంలో ఓపెనర్ మిఛెల్ మార్ష్.. తన రెండు కాళ్లను వరల్డ్ కప్ 2023 ట్రోఫీపై పెట్టడం తీవ్ర దుమారం రేగింది. ఇదే అహంకారం అంటూ నెటిజన్లు వారిపై దుమ్మెత్తి పోశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను పాట్ కమ్మిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా వారిపౌ విమర్శలు వెల్లువెత్తాయి. అప్పడు నెటిజన్లు ఎంతగా ట్రోల్ చేశారో… ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ఆస్ర్టేలియా క్రికెటర్లను ట్రోల్ చేస్తున్నారు. అహంకారానికి .. అభిమానానికి తేడా ఇదేనంటూ ఎత్తి పొడుస్తున్నారు.