Nellore YCP MP : శరత్ చంద్రారెడ్డికి నెల్లూరు వైసీపీ ఎంపీ టికెట్!
Nellore YCP MP : వైసీపీ కంచుకోటల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి. 2019 ఎన్నికల్లో ఆ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ లోక్ సభ రేసులోకి దిగుతున్నారు. నరసరావుపేట నుంచి వైసీపీ తరుఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా వైసీపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతోంది. నెల్లూరు రూరల్ నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.
ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ బరిలోకి వస్తుండడంతో.. ఆయన ఎంపీ స్థానం ఖాళీ అయ్యింది. అయితే అక్కడి నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని జగన్ భావించారు. ఆయన్ను పోటీ చేయించేందుకు అంతా రెడీ అవుతున్న సమయంలో వేమిరెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలని కండీషన్ పెట్టారు. నెల్లూరు సిటీ టికెట్ తన భార్యకు.. కందుకూరు టికెట్ తన అనుచరుడికి ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ ను వేమిరెడ్డి కోరారు.
కానీ వేమిరెడ్డి కోరినట్టుగా జగన్ ఆయా టికెట్లు ఇవ్వలేదు. నెల్లూరు సిటీ టికెట్ డిప్యూటీ మేయర్ ఖలీల్ కు ఇచ్చారు. ఈక్రమంలో అలకబూనిన వేమిరెడ్డి హైకమాండ్ కు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా పార్టీకి, నేతలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి అల్లుడి అన్న అయిన పెన్నాక శరత్ చంద్రారెడ్డిని నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్. ఈయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించినట్టు సీబీఐ, ఈడీ తెలిపాయి. లిక్కర్ కేసులో ఈయన అరెస్ట్ అయ్యారు. అనంతరం అప్రూవర్ గా మారడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇక నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.