Pregnant : వైద్యుల నిర్లక్ష్యం.. మెట్లపైనే గర్భిణి ప్రసవం

Pregnant
Negligence of doctors.. Pregnant Women : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఓ చెంచు మహిళకు ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించగా ఆమె మెట్లపైనే ప్రసవించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా కొత్తపల్లి చెంచుగూడేనికి చెందిన గర్భిణికి ఈ నెల 21న పురిటి నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు కొత్తపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వచ్చారు. ఆమె నొప్పులతో అల్లాడిపోతున్నా వైద్య సిబ్బంది ఇప్పుడే ప్రసవం కాదని, ఆమెను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని నిర్లక్ష్యంగా చెప్పారు. వారిని బతిమాలినా ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అంతలోనే గర్భిణి మెట్లపైనే ప్రసవించారు. బాధితురాలి బంధువులు ఈ ఘటనను వీడియోలు, ఫొటోలు తీశారు. తల్లీబిడ్డను తీసుకొని గూడెం వెళ్లిపోయారు.
ఫొటోలు, వీడియోలు బయటికొస్తే తమకు ఇబ్బందులు తప్పవని భయపడిన వైద్య సిబ్బంది, అదేరోజు సాయంత్రం గూడేనికి వెళ్లారు. వారికి సర్దిచెప్పి ఆధారాలు డిలీట్ చేయించారు. తల్లీబిడ్డను మళ్లీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించి మూడు రోజుల తర్వాత పంపించారని గూడెం వాసులు చెబుతున్నారు. చెంచు పేదరాలి పట్ల అమానవీయంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.