Chandrababu : అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని, ఎన్డీయే కూటమిదే అధికారమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో చివరి రోజు చిత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘నేను పుట్టిన జిల్లా, రాజకీయ జన్మనిచ్చి.. ఓనమాలు నేర్పని జిల్లా ఇది. అందుకే ఎన్నికల ప్రచారంలో చివరి సభ ఇక్కడ పెట్టుకున్నా. 45 ఏళ్లుగా నన్ను ఆదరించారు. ముందుకు నడిపించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశా. టీడీపీ, బీజేపీ, జనసేన సామాజిక న్యాయం పాటించాయి. కొన్ని కారణాల వల్ల రాజన్ కు సీటు ఇవ్వలేక పోయాం. రాజన్ కు సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తిరుపతిలో ఐఐటీ, ఐసర్ లాంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశామన్నారు. హైవేల విస్తరణకు కృషి చేసిన పార్టీ మాది. 49 సీట్లు ఇచ్చిన రాయలసీమ ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో పదవులన్నీ పెద్దిరెడ్డికే కావాలి. మేం వచ్చాక తిన్నదంతా వసూల చేస్తామని చంద్రబాబు చెప్పారు.వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగాయి. పది రూపాయలు ఇచ్చి, రూ.100 దోచుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఎన్డీయే కూటమిదే అధికారం అని చంద్రబాబు పేర్కొన్నారు.