Nazar on TDP : తెలంగాణ లో పోటీకి టీడీపీ దూరమైంది. ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక పోటీ చేయబోమని ఇప్పటికే అధినేత నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ సానుభూతి పరుల్ని తమ వైపు మళ్లించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
తెలంగాణలో ఎన్నికల విషయంలో ఈసారి టీడీపీ జోక్యం చేసుకోవడం లేదు. ఒక కాసాని రాజీనామా తర్వాత టీటీడీపీ అధ్యక్షుడ్ని కూడా ఎన్నికలైన తర్వాతే నియమించాలని నిర్ణయించారు. ఇక ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నందున తెలంగాణలో తమ పార్టీ కి టీడీపీ మద్దతివ్వాలని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు గట్టి ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన అభ్యర్థుల కూడా చంద్రబాబు ఫొటోను వాడేసుకుంటున్నారు.
అయితే దీనిపై టీడీపీ ఎలాంటి అడ్డూ చెప్పడం లేదు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టీడీపీ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్ కు మొగ్గు చూపుతారన్న చర్చ జరుగుతోంది. నేరుగా టీడీపీ సానుభూతిపరుల మద్దతు ఉందని కాంగ్రెస్ చెప్పుకోవడం లేదు. కానీ.. టీడీపీ సానుభూతిపరులు మాత్రం రేవంత్ వైపే వస్తున్నారు. ఆయన ఇప్పటికే వారితో లోపాయికారిగా టచ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇక బీఆర్ఎస్ కూడా టీటీడీపీ శ్రేణుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇటీవల ఓ చానల్ ఇంటర్యూలో కేటీఆర్ కూడా ఇలాగే స్పందించారు. కాంగ్రెస్ కు మేలు చేసేందుకే టీడీపీ పోటీ నుంచి విరమించుకున్నారని చేసిన ఆరోపణలను మరోసారి అనలేదు. దీంతో పాటు చంద్రబాబు అరెస్టుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి. మరి ఈ సారి ఎన్నికల్లో ఈ ఓట్లు ఏ మేరకు ప్రభావితం చూపుతాయే వేచి చూడాలి.