National Women’s Day : అంతరిక్షంలోకి అడుగులు ఓ వైపు.. గడప దాటితే గండం మరోవైపు.. ఎగుడుదిగుడుల్లో ‘ఆమె’ పయనం!

National Women's Day

National Women’s Day

National Women’s Day : ‘‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..’’ అని సినీ కవి మహిళా శక్తిని తనదైన పదాలతో కొలిచాడు. శిశువుకు జన్మనివ్వడంలోనే కాదూ ఆ బిడ్డను సంపూర్ణ మనిషిగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను ఆ తల్లి తీసుకుంటుంది. అందుకే దేవతలను కొలువలేనిచోట, దేవతలు లేని చోట తల్లిని కొలవడం కాదు..సృష్టిలో ఏ చోటనైనా కొలువగలిగేది తల్లి ఒక్కరే. మాతృ ప్రేమ మనుషుల్లోనే సకల జీవరాశుల్లోనూ అదే స్థాయిలో ఉంటుందనే కొత్తగా చెప్పే విషయమేమి కాదు.

నేటి ఆధునాతన సాంకేతిక యుగంలో ఆడవారి పాత్ర తక్కువేమి కాదు. పురుషులకు దీటుగా ఎన్నో రంగాల్లో వారే ముందంజ వేస్తున్నారు. నింగిలో సగం అని ఆడవాళ్లను సాధారణంగా అంటూ ఉంటారు. ఇప్పుడా నింగిలోకి రాకెట్లలో ‘ఆమె’ దూసుకెళ్తోంది. వంటగదిలో గరిటే తిప్పడంలోనే కాదు  యుద్ధరంగంలో గన్ కూడా పేల్చగలుగుతోంది నేటి మగువ. నేడు(ఫిబ్రవరి 13) జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

అన్ని రంగాల్లో ‘ఆమె’ ప్రయాణం వేగవంతమైనా..ఇంకా పలు రంగాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. పనిచేసే చోటనే కాదు ఇంటిలోనూ లైంగిక దాడు, వేధింపులు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రేమ పేరిట కొందరు, కామవాంఛతో కొందరు ‘ఆమె’ను చెరపడుతున్నారు. తమ ‘మాట’ వినడం లేదని యాసిడ్ దాడులు చేస్తున్నారు. అవసరమైతే అంతమొందిస్తున్నారు.

‘ఆధునిక మహిళ’గా కీర్తి అందకుంటున్నా.. మన దేశంలో మాత్రం ఆడవారికి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ సాధికారత లభించలేదనే చెప్పాలి. దేశ అధ్యక్షురాలిగా ద్రౌపదీ ముర్ము, గవర్నర్లుగా  మరెందరో ఉన్నా.. కీలకమైన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలుగా, మంత్రులు, ఎమ్మెల్యేలుగా వారి ప్రాతినిధ్యం చాలా తక్కువే. నామినేట్ పదవులు వరిస్తున్నా అసలైన రాజకీయం మాత్రం వారి చేతికి చిక్కడం లేదు. ఇక సర్పంచ్ లు, ఎంపీటీసీలు సగభాగం ఉన్నా.. పాలన అంతా భర్తలదే కావడంతో ‘మహిళా రాజకీయ సాధికారత’కు అర్థం లేకుండా పోతోంది. మహిళల కోసం ఎన్నో చట్టాలు చేసినా నిష్ప్రయోజనమే అవుతున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు వాటి అమలులో నిజాయితీని ప్రదర్శించడం లేదు.

దేశంలో మహిళను దేవతామూర్తులుగా కొలుస్తున్నా.. బయట మాత్రం ‘అందాల బొమ్మ’గా తమ లైంగిక కాంక్షను తీర్చుకునే వస్తువుగానే చాలా మంది పరిగణిస్తున్నారు. ఇప్పటికీ మన దేశంను బయటి దేశాలకు, రాష్ట్రాల మధ్య ‘హ్యుమన్ ట్రాఫికింగ్’ యథేచ్ఛగా సాగిస్తూనే ఉన్నారు. చిన్న అమ్మాయిల నుంచి నడి ఈడు వయస్సు దాక వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఈ బిజినెస్ ను నడిపేది మహిళలే కావడం గమనార్హం. డబ్బు కోసం అమాయక యువతులను దారుణంగా కొట్టి మరి ఈ రొంపిలోకి దించుతున్నారు. అలాగే పట్టణాలు, నగరాల్లోనూ వ్యభిచారం కొత్త పొకడలకు పోతోంది. ఆన్ లైన్ ద్వారా అమ్మాయిల సరఫరా వంటివి చూస్తే సమాజం ఎటుపోతుంది అనిపిస్తుంది.

ఓ రకంగా చెప్పాలంటే దేశంలో మహిళలు దాదాపు పూర్తిభద్రత మధ్యనే ఉన్నా.. అక్కడక్కడా జరిగే సంఘటనల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటోంది. ఆడవాళ్లకు రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలను మరింత పెంచాలి. వారి భద్రత కోసం, గౌరవం కోసం గట్టి చట్టాలు చేయాలి. అలాగే వారిని వేధించే మృగాళ్ల పని పట్టేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలి. అప్పుడే భారత మహిళా శక్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడగలుగుతుంది.

TAGS