Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ మేరకు పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు పలువురు సెలబ్రిటీలను కూడా వినియోగించుకుంటోంది. ప్రస్తుతం జనాల నాడీని బట్టి రాష్ట్రంలో టీడీపీ కూటమే అధికారంలోకి రాబోతోందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రచారంతో ప్రజల్లో కూటమికి అనుకూలమైన వేవ్ కనపడుతోంది. ఐదేళ్లలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఉద్యోగ, ఉపాధి, రాజధాని విషయమై యువత జగన్ పార్టీపై కన్నెర్ర చేస్తున్నారు.
నామినేషన్ల కోలాహలం సాగుతున్న వేళ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోడ్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణం నిన్న పిఠాపురంలో జరిగిన ఎన్నికల నామినేషన్ ర్యాలీలో జాతీయ జెండాను ఓ చేత్తో, కూటమి జెండాను మరో చేత్తో పట్టుకుని ప్రదర్శించడమే. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ రాజకీయ పార్టీలేవీ ఈసీకి ఫిర్యాదు చేయలేదు.
నిన్న పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ సందర్భంగా పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరైన జనసందోహాన్ని చూసి పవన్ ఉత్సాహంగా ఓ చేత్తో జాతీయ జెండా, మరో చేతిలో కూటమి జెండా పట్టుకుని ఊపారు. ఇలా చేయడం కోడ్ నిబంధనలకు విరుద్ధం. ఈ సందర్భంగా పవన్ జాతీయ జెండాను అగౌరవపరిచారన్న విమర్శలు వస్తున్నాయి.
జాతీయ జెండా కోడ్ ప్రకారం ఎవరైనా జాతీయ జెండా ప్రదర్శించవచ్చు. అయితే దాన్ని అత్యున్నత స్థానంలో లేదా ఎత్తులో ఉంచి ప్రదర్శించాలి. పార్టీల జెండాలు, ఇతర జెండాలతో కలిసి ప్రదర్శించరాదు. అలాగే ఎవరైనా చేత్తో జాతీయ జెండాను పట్టుకుని ప్రదర్శిస్తున్నప్పుడు అది కుడి చేతిలోనే ఉండాలి. ఇక్కడ పవన్ ఎడమ చేతిలో జెండా ఉంది. ఇలా చేస్తే కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో పవన్ జెండా కోడ్ ఉల్లంఘించినట్టైంది.