JAISW News Telugu

Narasaraopet :నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధింపుల నుంచి రక్షించండి..వీడియో వైరల్

Narasaraopet MLA Gopireddy harassment

Narasaraopet MLA Gopireddy harassment

Narasaraopet News : పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేధింపుల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించాలని నరసరావుపేటకు చెందిన గునపాటి వెంకటేశ్వరరెడ్డి అనే రైతు వాపోయాడు. ఆయన విడుదల చేసిన వీడియో ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమైంది.

ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాడేపల్లికి పిలిపించుకుని..ఎమ్మెల్యేతో మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని  ప్రశ్నించారు. ఈక్రమంలో వారు చెప్పిన సమస్యలు విన్నారు. ఈసందర్భంగా గునపాటి వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవినీతిపై విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారు. నరసరావుపేటలో 2015లో పొలం కొనుగోలు చేశానని,  ఆ పొలం తనకు ఇవ్వమని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.  గోపిరెడ్డికి రెండు దఫాలుగా రూ. 23 లక్షల లంచం ఇచ్చినా విడిచి పెట్టడం లేదని ఆరోపించాడు.

నిన్న అర్ధరాత్రి తమ ఇంటికి  ఎమ్మెల్యే అనుచరులు జాన్, మరికొందరు వచ్చి దాడి చేశారని  వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. తనకు, తన కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో ప్రాణహాని ఉందని, పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. తాను కడప జిల్లా నుంచి 4 దశాబ్దాల కింద నరసరావుపేటకు వచ్చినట్టు, ఇక్కడే జీవిస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ ఈ విషయంలో కలుగజేసుకుని తనకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నారు. లేదంటే తనకు, తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని వేడుకున్నారు.

కాగా, ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యే కబ్జాకోరుతనం, అవినీతి,  గూండాయిజంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య గునపాటి వెంకటేశ్వరరెడ్డి ఒక్కరిదే కాదని, వందల మంది ప్రజలు ఎమ్మెల్యేల కబ్జాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్నారని, త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెపుతారని అంటున్నారు.

Exit mobile version