Balakrishna : టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. టిడిపి అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్ వేయడం ఇది మూడోసారి. తన భార్యతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్సేగా గెలిచిన బాలయ్య ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చామని అన్నారు. అన్న క్యాంటీన్లను వైకాపా ప్రభుత్వం తొలగించినా హిందుపురంలో ప్రతిరోజు 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.