JAISW News Telugu

Telangana : రుణమాఫీ జాబితాలో పేరున్న డబ్బులు పడలేదు..

Telangana

Telangana

Telangana : రాష్ట్రం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలకు  జూలై 18  సాయంత్రం రైతు రుణమాఫీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తొలి విడతగా లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు నిధుల విడుదల చేశారు. ఇక లక్ష రూపాయల నుంచి 1.5 లక్షల వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరు లోపు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టులో రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది.

కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై క్షేత్ర స్థాయిలో కొంత గందరగోళం నెలకొంది. రుణమాఫీ జాబితాలో పేరు ఉండి.. మాఫీ సొమ్ము ఖాతాలో పడనివారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రానివారు మరికొందరు. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ముందుగా ప్రకటించకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మూడు నాలుగు రోజుల ముందే జాబితాలను విడుదల చేసి ఉంటే.. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేది.  

రుణమాఫీకి అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ.. బ్యాంకులకు అందజేయగా, వారు రైతుల బ్యాంకు ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేశారు. ఈ మేరకు రుణాలు మాఫీన చాలా మందికి బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అయితే కొందరికి మాత్రం రుణమాఫీ పొందేవారి జాబితాలో పేరు ఉండి కూడా.. మాఫీ అయినట్లుగా మెసేజ్‌ రాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురై.. వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు, బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. అయితే జాబితాలో ఉన్న అందరికీ మాఫీ వస్తుందని, అందరి ఖాతాల్లో డబ్బు జమ అయ్యేందుకు 48 గంటల సమయం పడుతుందని బ్యాంకు అధికారులు రైతులకు నచ్చజెప్పి పంపిస్తున్నారు. ఉదాహరణకు.. నల్లగొండ జిల్లాలో 83,124 మంది రైతులకు రూ.లక్ష చొప్పున మాఫీకిగాను రూ.455 కోట్లు మంజూరయ్యాయి. కానీ, లిస్టులో పేర్లున్న రైతుల ఖాతాల్లో శుక్రవారం వరకు కూడా డబ్బులు జమ కాలేదు. జనగామ జిల్లాలో 26,496 మందికి రుణమాఫీ జరగాల్సి ఉండగా.. 22 వేల మందికి మాత్రమే జమ అయ్యాయి. మరో నాలుగు వేలకు పైగా రైతులకు రుణమాఫీ కాలేదు.

మరికొన్ని చోట్ల.. కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది పేరిట భూమి ఉన్నా.. ఒకే బ్యాంకు ఖాతా ఉండి, రూ.లక్ష లోపే రుణం ఉన్నా మాఫీ జాబితాలో వారి పేరు రాలేదు. ఇంకొన్ని చోట్ల కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మందికి రుణం ఉండి, అంతా కలిపి రూ.లక్ష లోపు ఉండగా.. ఒక్కరి పేరుమీద ఉన్న మొత్తం మాత్రమే మాఫీ అయింది. ఇలాంటి వారందరికీ సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఈ మొత్తం గందరగోళానికి జాబితాలను ముందుగా వెల్లడించకపోవడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే మల్లన్నసాగర్‌ నిర్వాసితుల్లో చాలా మందికి రుణమాఫీ జరగలేదు. పంట రుణాలు చెల్లించొద్దని, తాము మాఫీ చేస్తామని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పడంతో 2016కు ముందు తీసుకున్న రుణాలను వారు చెల్లించలేదు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీకి కటాఫ్‌ పెట్టడంతో నిర్వాసితులకు మాఫీ కాకుండా పోయింది.

Exit mobile version