Nitin Gadkari : రూ.516 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్డు : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari : నేషనల్ హైవే నం.565లో నల్గొండ పట్టణం గుండా సాగే నకిరేకల్-నాగార్జునసాగర్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.516 కోట్లతో 14 కి.మీ. మేర 4 వరుసల బైపాస్ రోడ్డు నిర్మించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీకి ఈ 565 నేషనల్ హైవే అత్యంత ప్రధానమైనదని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలోని నకిరేకల్ కూడలి నుంచి మొదలయ్యే ఈ నేషనల్ హైవే నల్గొండ, ఏపీలోని మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా సాగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం నల్గొండ నుంచి సాగే రహదారితో భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. తాజాగా మంజూరు చేసిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. దాంతోపాటుగా నకిరేకల్-నాగార్జునసాగర్ మధ్య అనుసంధానం కూడా మెరుగవుతుంది. ప్రజల సురక్షితమైన ప్రయాణానికి ఈ రహదారి మేలు చేకూరుస్తుందని గడ్కరీ ట్వీట్ చేశారు.