Haryana CM : హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం
Haryana CM Naib Singh Saini : హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఆయన వాల్మీకి ఆలయంలో పూజలో చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆధ్వ్రర్యంలో రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. పంచకులలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
హర్యానాలో అక్టోబరు 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లు గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టింది. ఇక్కడ కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నాయబ్ సింగ్ సైనీ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపింది. బుధవారం జరిగిన శాసనసభా పక్ష భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో హర్యానా సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.