Hyderabad Metro : నాగోల్-చాంద్రాయణగుట్ట మెట్రో మార్గంలో 13 స్టేషన్లు
Hyderabad Metro : శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట 14 కిలోమీటర్ల వరకు 13 స్టేషన్లు ఉన్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ మార్గంలో మెట్రో రైలు అలైన్ మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు శనివారం ఆయన అధికారులతో కలిసి కాలినడకన పరిశీలించారు.
నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల కారణంగా స్టేషన్ల కోసం భూసేకరణ అనివార్యమయిందని, ప్రైవేటు ఆస్తులు కనిష్ఠంగా సేకరించేలా జాగ్రత్తగా ప్రణాళిక వేయాలని అధికారులను మెట్రోరైలు ఎండీ ఆదేశించారు. మెట్రో రైలు స్టేషన్ స్థానానికి సంబంధించి, వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈఈ డీవీఎస్ రాజు, సీఎస్ టీఈ ఎస్.కె.దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జీఎం బీఎన్ రాజేశ్వర్, ఎస్ ఈ వై.సాపరెడ్డి, డీపీఆర్ కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొన్నారు.