Nagababu : అనకాపల్లి కాదని.. మచిలీపట్నంకు షిఫ్ట్ అయిన నాగబాబు! గెలిస్తే కేంద్రంలో ఆ పదవి వస్తుందా?
Nagababu : జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదెల ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. తెలుగుదేశం, జనసేన శిబిరాల్లో అభ్యర్థుల ఖరారు చివరి దశ చేరుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాలో చివరి నిమిషంలో మార్పులకు ఇదే సరైన సమయం అని కూటమి భావించింది. చివరి నిమిషంలో జరిగిన మార్పులో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎంపీ టికెట్ దక్కినట్లు తెలుస్తోంది.
తొలుత అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన నాగబాబు ఆ తర్వాత పొత్తుల కారణంగా స్థానిక సమీకరణాల ఆధారంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నికల పదవులు లేకుండా జనసేన కోసం పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నాగబాబు చాలా సందర్భాల్లో చెప్పుకచ్చారు.
ఇప్పుడు హఠాత్తుగా జనసేన కోటా కింద మచిలీపట్నం ఎంపీ స్థానానికి నాగబాబు పేరు ఖరారైనట్లు జనసేన కేడర్ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. తొలుత ఈ సీటు వైసీపీ అభ్యర్థి బాలశౌరికి దక్కగా, ఆయన ఇక్కడి నుంచి జనసేన ఎంపీగా దాదాపు ఖరారయ్యారు. కానీ చివరి నిమిషంలో నాగబాబు రంగంలోకి దిగడంతో ఆయనకు టికెట్ దక్కినట్లు వినికిడి.
దీనికి బదులుగా బాలశౌరిని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి పంపారని, మచిలీపట్నం ఎంపీ స్థానానికి పోటీ నుంచి అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఆయన వెంటనే వెళ్లిపోయారని సమాచారం.
అయితే, నాగబాబు అసెంబ్లీ ఎన్నికలు కాదని పార్లమెంట్ బరిలో దిగడం రాజకీయ ఎత్తుగడేనని ఏపీ రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది. ఈ నేపథ్యంలో నాగబాబు ఎంపీగా గెలుపొందితే.. కేంద్రం నుంచి సెంట్రల్ మినిస్టర్ పదవి దక్కుతుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ భారీ స్కెచ్ తర్వాతే చంద్రబాబును ఒప్పించి మరీ మచిలిపట్నం టికెట్ కన్ఫమ్ చేయించుకున్నారని పార్టీ వర్గాల నుంచి లీకులు వినిపిస్తున్నాయి.