Naa Saami Ranga Review : ‘నా సామి రంగ’ మూవీ ఫుల్ రివ్యూ..ఫ్యాన్స్ 8 ఏళ్ళ ఆకలి తీర్చేసిన నాగార్జున!
నటీనటులు : అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్న మీనన్, రుక్సార్ తదితరులు.
దర్శకత్వం : విజయ్ బిన్నీ
సంగీతం : కీరవాణి
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఎల్లప్పుడూ ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. అప్పట్లో సక్సెస్ అయ్యాయి, టాలీవుడ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రయోగాలు విఫలం అవుతున్నాయి. పెద్ద వయస్సులో గౌరవంగా ఉండేలాగా ఒక్క కమర్షియల్ హిట్ ఇవ్వమని, కమర్షియల్ మాస్ సినిమాని తియ్యమని నాగార్జున అభిమానులు సోషల్ మీడియా లో ఆయన్ని ట్యాగ్ చేసి అడుగుతూ ఉంటారు. ఎందులకంటే నాగార్జున కమర్షియల్ మూవీ చేసిన ప్రతీసారి అత్యధిక శాతం సక్సెస్ లను అందుకున్నాడు. అందుకే ఈ సారి పండగకి ‘నా సామి రంగ’ అంటూ నేడు మన ముందుకి వచ్చాడు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాటలు కూడా అదిరాయి, మరి ఈ సినిమా నాగార్జున అభిమానుల ఆకలి ని తీర్చిందో లేదో ఒకసారి ఈ రివ్యూ చూసి తెలుసుకుందాం.
కథ :
కృష్ణయ్య ( నాగార్జున), అంజి (అల్లరి నరేష్) చిన్ననాటి ప్రాణ స్నేహితులు. సొంత అన్నదమ్ములు లాగ కలిసి పెరుగుతారు. కృష్ణయ్య కి ఏ చిన్న కష్టం వచ్చినా, అయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా అసలు ఊరుకోడు అంజి. ఇది ఇలా ఉండగా కృష్ణయ్య తన యుక్త వయస్సులో వరలక్ష్మి (ఆషికా రంగనాథ్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. చదువుకుంటున్న రోజుల్లో వరలక్ష్మి ని ఒకడు ఏడిపించినందుకు కృష్ణయ్య, అంజి ఏడిపించిన వ్యక్తిని చితక బాదుతారు. ఆ కారణంగా వీళ్లిద్దరు చదువుకు దూరం అవుతారు. అయితే కృష్ణయ్య, వరలక్ష్మి ప్రేమించుకోవడం వరలక్ష్మి తండ్రి కి అసలు ఇష్టం ఉండదు. ఒకరోజు ప్రమాదం లో వరలక్ష్మి తండ్రి చనిపోతాడు, అది కృష్ణయ్య వల్లే జరిగిందని వరలక్ష్మి అతన్ని ద్వేషించడం మొదలు పెడుతుంది, ఇదంతా ఫ్లాష్ బ్యాక్. అంజి కృష్ణయ్య మరియు వరలక్ష్మి ని కలిపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా సాగుతున్న వీరి జీవితాల్లోకి భాస్కర్ (రాజ్ తరుణ్) వస్తాడు. ఇతను వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఎదురు అవుతాయి. గొడవలు కూడా జరుగుతాయి, ఆ గొడవల్లో అంజి చనిపోతాడు. తన ప్రాణ స్నేహితుడిని చంపినా వారిపై కృష్ణయ్య ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే స్టోరీ.
విశ్లేషణ :
డ్యాన్స్ మాస్టర్ విజయ్ బెన్నీ కి దర్శకుడిగా ఇది మొదటి సినిమానే అయినప్పటికీ, చాలా చక్కగా తీసాడనే చెప్పాలి. ప్రథమార్ధం మొత్తం అలా సరదాగా నడిచిపోతూ ఉంటుంది ఈ సినిమా, కానీ నాగార్జున మరియు ఆషికా రంగనాథ్ లవ్ ట్రాక్ చూసే ఆడియన్స్ కి కాస్త బోర్ కొడుతాది. ఆ తర్వాత నుండి సినిమా మళ్ళీ ఊపందుకుంటుంది, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశం వరకు మాస్ సన్నివేశాలు అదిరిపోతాయి. ఇది నాగార్జున అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన్ని ఇంత మాస్ గా చూసి అభిమానులు చాలా కాలమే అయ్యింది. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం లో కాస్త స్లో గానే అనిపించినా , ఆ తర్వాత స్క్రీన్ ప్లే లో వేగం అందుకుంటుంది. అల్లరి నరేష్ పాత్ర ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తుంది. సెంటిమెంట్ మరియు ఎమోషన్స్ సెకండ్ హాఫ్ లో బాగా పండాయి. ఓవరాల్ గా ఈ సినిమా చాలా కాలం తర్వాత నాగ్ నుండి మంచి సినిమా వచ్చింది అనే తృప్తిని ప్రతీ ప్రేక్షకుడికి ఇస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే నాగార్జున ఈ సినిమాతో అభిమానులకు భుక్తాయాసం ఇచ్చే రేంజ్ లో నటించాడు. మాస్ సన్నివేశాల్లో నాగార్జున విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఇక అల్లరి నరేష్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ రోల్ పడింది. స్నేహం కోసం ప్రాణాలను సైతం ఇచ్చే వాడిగా ఆయన నటించిన తీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక కెరీర్ లో గత కొంతకాలం నుండి వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ మార్కెట్ మొత్తం కోల్పోయిన రాజ్ తరుణ్ కి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దొరికింది. ఇక వరలక్ష్మి గా ఆశికా రంగనాథ్ అద్భుతమైన నటన కనబర్చింది. కేవలం 27 ఏళ్ళు ఉన్న ఈ అమ్మాయి , రెండు డిఫరెంట్ వేరియేషన్ లుక్స్ లో కనిపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. కీరవాణి అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
చివరిమాట :
చాలా కాలం తర్వాత నాగార్జున నుండి వచ్చిన సూపర్ హిట్ కమర్షియల్ చిత్రం. మాస్ ఆడియన్స్ తో పాటుగా, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం నచ్చేస్తుంది.
రేటింగ్ : 3/5