Janasena Counters : ఏపీలో ఈ నెల 13న పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఓట్ల లెక్కింపు గడువు దగ్గరకు వస్తున్నా కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటుంది. అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్ డే మీదే ఉంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైసీపీ, ఇటు కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ఎన్నికల ఫలితాల కోసం తెలుగు ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు వచ్చిన తరువాత ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ?, నాయకుల తలరాతలు ఎలా మారిపోబోతున్నాయో అని ఎవరికి తోచినట్లు వాళ్లు ఆలోచించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయి రెండు వారాలు అయినా రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. అలాంటి నియోజక వర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఇదే పిఠాపురం నుంచి వైసీసీ సిట్టింగ్ ఎంపీ వంగా గీతా కూడా బరిలో నిలిచారు.
ఇక పిఠాపురంలో కాబోయే ఎమ్మెల్యే ఎవరని స్థానికులతో పాటు దేశ విదేశాల్లోని తెలుగు వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ జరిగి రెండు వారాలు అయినా వైసీపీ నాయకులు మాత్రం పిఠాపురంలో మేం అంత చేశాము, ఇంత చేశామంటూ చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కు మైనస్ పాయింట్లు, మా నాయకురాలు వంగా గీతాకు ఫ్లస్ పాయింట్లు చాలా ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసిన వైసీపీ నాయకులు ఏపీకి కాబోయే ఉప ముఖ్యమంత్రి వంగా గీతా అంటూ ఏకంగా కార్ల మీద స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఎల్ఎల్బీ పట్టాపొందిన వంగా గీతా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా, పిఠాపురం ఎమ్మెల్యేగా, రాజ్యసభ ఎంపీగా, మరోసారి ఎంపీగా పని చేశారని పదేళ్లపాటు ఆమెకు ప్రజా సేవ చేసిన అనుభవం ఉందని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్ గురించి చాలా చులకనగా మాట్లాడుతూ సెటైర్లు వేస్తున్నారు. పదో తరగతి చదివిన పవన్ కల్యాణ్ కు.. మా నాయకురాలు వంగా గీతాకు పోటీనా అని ఎద్దేవా చేస్తున్నారు. పవన్ ప్యాకేజీ స్టార్ అని, ఆయనకు చిన్న జ్వరం వస్తే హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్ వెళ్లిపోయి సినిమాలు తీసుకుంటారని ఆరోపిస్తున్నారు. సినిమాలు తీసుకునే పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఉండడని అంటున్నారు. అందుకే నిత్యం అందుబాటులో ఉండే వంగా గీతాను గెలిపించుకోవాలని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయినట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు. పిఠాపురంలో వంగా గీతా మరోసారి ఎమ్మెల్యే కావడం గ్యారంటీ అని ధీమాతో ఉన్నారు.ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా జూన్ 4న పవన్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని జన సైనికులు అంటున్నారు.