R. Krishnaiah : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే నా లక్ష్యం: ఆర్.కృష్ణయ్య
R. Krishnaiah : బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించడం నా జీవిత లక్ష్యమని ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. విద్యానగర్ లోని బీసీ భవన్ లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా చేయబోతున్నాం. బీసీ ఉద్యమం బలోపేతం కోసం రాజ్యసభ పదవికి రాజీనామా చేశాను. ఈ ఉద్యమం ద్వారా దేశ వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగేలా పోరాడుతాను. వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ వర్గాలకు న్యాయం చేయడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏండ్లు గడుస్తున్నప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని బీసీ బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య తెలిపారు.
బీసీల తరపున చట్టసభల్లో ప్రశ్నించినా సమాధానం రాలేదు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు బీసీలకు ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్లె పెంచాలి. బీసీల కోసం చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయాలని బీసీలను కోరుతున్నానని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.