Amaran : చెన్నైలోని కమల్ హాసన్ ఇంటి ముందు ముస్లింలు గురువారం ఆందోళనకు దిగారు. కమల్ హాసన్ నిర్మించిన అమరన్ సినిమాలో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించారని ఆరోపిస్తూ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని SDPI డిమాండ్ చేసింది. కమల్ హాసన్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు-నిర్మాత కమల్ హాసన్ నిర్మించిన, శివకార్తికేయన్ నటించిన అమరన్, ఇండియన్ ఆర్మీలో పనిచేసి మరణించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది.
ముకుంద్ వరదరాజన్ కులాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని అందులో వివాదాలు తలెత్తాయి. ఏఐఏడీఎంకే కూటమిలో భాగమైన SDPI అమరన్ సినిమాను నిషేధించాలని నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఈ సినిమాపై మరో వివాదం చెలరేగింది. మైనార్టీ ముస్లింలపై విద్వేషాలు రెచ్చగొడుతూ సామరస్యాన్ని ధ్వంసం చేస్తున్న అమరన్ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్టీపీఐ రాజ్ కమల్ కంపెనీని ముట్టడించి నిరసన తెలిపింది. దీంతో రాజ్ కమల్ కంపెనీ ఉన్న తేనాంపేట ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.