Komati Reddy Venkata Reddy : ఆటంకాలు ఎదురైనా మూసీనది ప్రక్షాళన పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komati Reddy Venkata Reddy : ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీనది ప్రక్షాళన పూర్తి చేస్తామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ లో అసోచామ్ ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మూసీని సుందరీకరించి ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు. మూసీకంటే ప్రమాదకరమైన సబర్మతిని మంచినీటి సరస్సుగా మార్చారని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ మహానగర్ జనాభా కోటిన్నర దాటిందని, నగరంలో నాలుగు మేయర్ స్థానాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. అమెరికా తర్వాత అధిక బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని, రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు.