Sunkara Padmasri : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కయ్యం మొదలైందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణలో ‘వైఎస్ఆర్ తెలంగాణ’ పార్టీ పెట్టిన షర్మిల 2023లో ఒక్క అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేయకుండా తప్పుకుంది. తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిలకు మొదట్లో కొంత ఆదరణ వచ్చింది. కానీ ఆమె మాటలు, స్పీచ్, ప్రవర్తనతో ప్రజలు తిరస్కరించడం మొదలు పెట్టారు. పైగా పొరుగు రాష్ట్ర (ఏపీ) సీఎం సోదరిగా అక్కడ ఉండకుండా ఇక్కడ ఏం పని అంటూ నిలదీయడం మొదలు పెట్టారు. దీంతో ఆమె 2023 ఎన్నికలలో పోటీ చేయలేదు.
తెలంగాణలో తమ పార్టీని కాంగ్రెస్ లో కలిపితే ఏపీపీసీసీ పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పడంతో సొంత రాష్ట్రంలో ఏపీపీసీసీ పదవి తీసుకుంది. ఏపీ ఎన్నికలు 2024లో పోటీ చేసి ఒక్క సీటు కూడా సాధించలేదు. అసలే ఏపీలో జీవం కోల్పోయిన కాంగ్రెస్ ను మరింత అట్టడుగుకు షర్మిల తొక్కేసిందంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
కడప స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వైఎస్ షర్మిల కేవలం లక్ష ఓట్లను మాత్రమే తెచ్చుకుంది. షర్మిల వైసీపీపై, సోదరుడు జగన్ ఓటమిపై ఏ విధమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. పైగా ఇద్దరి మధ్య (రెండు పార్టీల మధ్య) తేడా కూడా లక్షలకు పైగా తేడా ఉంది.
అదే బీజేపీని తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 2.85 శాతం ఓట్లను తెచ్చుకొని 8 అసెంబ్లీ సీట్లను, రెండు పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. దీనిపై విజయవాడ ఎంపీకి పోటీ చేసి ఓటమి పాలైన సుంకర పద్మశ్రీ షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఏపీలో ఉన్న కాస్త ఆశలను షర్మిల నాశనం చేసిందంటూ ఆమె మండిపడ్డారు. దీంతో ఏపీ కాంగ్రెస్ లో ముసలం పుట్టిందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.