Murder : వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన బెంగళూరు కోణనకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమేశ్వర లేఔట్ లో నిర్మాణ దశలో ఉన్న కట్టడంలో బుధవారం రాత్రి కూలి లక్ష్మీ (33), ఆమె ప్రియుడు గణేశ్ కుమార్ (20) ఏకాంతంగా ఉన్నారు. వారిని గమనించిన ఆమె భర్త గొల్లబాబు (41) తీవ్ర కోపోద్రిక్తుడై కట్టె తీసుకొని ఇద్దరిని చావబాదాడు. ఆ దెబ్బలకు వారు మృతి చెందారు. అనంతరం అతడు అక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన ముగ్గురు కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. అవివాహితుడైన గణేష్ కుమార్, గొల్లబాబు వద్ద ఉండేవాడు. ఈ సమయంలో అతని భార్యతో చనువు పెరిగి అనైతిక సంబంధానికి దారితీసినట్లు అనుమానాలున్నాయి. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై గొల్లబాబుకు అనుమానం పుట్టింది. దీంతో ఆమెపై నిఘా వేశాడు. యువకునితో కలిసి ఉన్న సమయంలో దాడిచేసి హతమార్చాడని దక్షిణ విభాగ డీసీపీ లోకేశ్ భరమప్ప జగలాసర్ తెలిపారు.
తరువాత అతడు తన బావమరిదికి ఫోన్ చేసి విషయం తెలియజేసి, నేను కూడా చనిపోతున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే కోణనకుంటె పోలీసులు చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.