Murali Mohan:తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ ప్రముఖుల నడుమ వియ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ మనవరాలు (కొడుకు కూతురు) రాగను ఆస్కార్ విన్నింగ్ మాస్ట్రో MM కీరవాణి కుమారుడు, యువకథానాయకుడు శ్రీ సింహా కోడూరి పెళ్లాడనున్నాడు. మురళీ మోహన్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో గౌరవనీయమైన వ్యక్తి. సినీ పరిశ్రమలో అద్భుత ఆదరణ చూరగొన్న నటుడు. రాజకీయ నాయకుడిగాను సుపరిచితులు. MM కీరవాణి సంగీత పరిశ్రమకు స్మారక సేవలను అందించిన ప్రజ్ఞావంతుడు.
ఇటీవలే `ఆర్ఆర్ఆర్` నాటు నాటు..తో ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీలో భారతదేశానికి ఆస్కార్‌ని అందించారు. ఇప్పుడు ఇరువురు దిగ్గజాలు వియ్యమంది కుటుంబాలు ఒకటి కాబోతున్నందున ఇది టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. తాజా ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ.. ఈ వివాహంపై మీడియాలో వచ్చే కథనాలు నిజమేనని అంగీకరించారు. వచ్చే ఏడాది చివరిలో ఈ పెళ్లి జరగనుందని తెలిపారు. తనకు ఒక కొడుకు కూతురు ఉండగా, కూతురు విదేశాల్లో స్థిరపడ్డారని ఆమె కుమార్తెకు వచ్చే ఏడాది ఆరంభంలో వివాహం జరగనుందని మురళీమోహన్ వెల్లడించారు.
అలాగే తన కుమారు(రామ్ మోహన్)ని కుమార్తె రాగ పెళ్లి శ్రీసింహా కోడూరితో వచ్చే ఏడాది చివరిలో జరుగుతుందని స్పష్ఠతనిచ్చారు. పెద్ద మనవరాలి పెళ్లి 2024ఫిబ్రవరిలో జరగనుండగా, చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివరిలో జరుగుతుందని మురళీమోహన్ తెలిపారు. శ్రీసింహాకు కాబోయే భార్య రాగ విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసి మురళీమోహన్ కి చెందిన సువిశాల వ్యాపారసామ్రాజ్యంలో కీలక పదవిలో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
మరకతమణి MM కీరవాణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నిష్ణాత గాయకుడు, సంగీత విద్వాంసుడు కాల భైరవ .. వర్ధమాన కథానాయకుడు శ్రీ సింహ కోడూరి. శ్రీసింహ మత్తు వదలరా సినిమాతో నటుడిగా రంగప్రవేశం చేశాడు. తరువాత మరో రెండు సినిమాలు చేసాడు. సింహా యమ దొంగ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు. చివరిగా భాగ్ సాలే చిత్రంలో కనిపించాడు. ఇప్పుడు అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పరిశ్రమలో కీరవాణి- మురళీమోహన్ కి గొప్ప అనుబంధం ఉంది. తాజాగా ఈ యూనియన్‌పై మురళీమోహన్ అధికారికంగా ప్రకటించడం విశేషం.