Lingala Bridge : గత రెండు రోజులుగా వరద ఉధృతికి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని లింగాల వంతెన కొట్టుకుపోయింది. సుమారు కిలోమీటర్ పొడవు ఉన్న ఈ వంతెనకు పలు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. దీంతో వరదలో కాంక్రీట్ స్లాబులు కొట్టుకుపోయాయి. వంతెనపై పలు చోట్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయని, మరమ్మతులకు కూడా పనికిరాదని స్థానికులు పేర్కొంటున్నారు.
వత్సవాయి, లింగాల గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు సైతం ధ్వంసమయ్యాయి. లింగాల వెంతెన కొట్టుకుపోవడంతో జగ్గయ్యపేట నుంచి ఖమ్మం ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మున్నేరులో వరద ఉధృతి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కేవలం 17 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. పోలంపల్లి డ్యాం వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది.