Mumbai Indians : ముంబై ఇండియన్స్ రెండుగా చీలిందా? గ్రూపులుగా మారిన ఆటగాళ్లు?
Mumbai Indians : ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజం ప్రాతినిధ్యం వహించిన ఈ టీమ్ కు ఎన్నో ఘనతలు ఉన్నాయి. ఈ లీగ్ లో ఎంఐ సాధించిన విజయాలు, రికార్డులకు లెక్కే లేదు. అలాగే ఎంతో మంది సక్సెస్ ఫుల్ ఆటగాళ్లను టీమిండియాకు అందించిన ఘనత ఈ టీమ్ దే. అంబటి రాయుడు, పాండ్యా బ్రదర్స్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ , సూర్య కుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లు ఈ టీమ్ నుంచే గొప్ప పేరు తెచ్చుకున్నారు. ముంబై ఇండియన్స్ ఎంపికైతే ఇక తమ దశ తిరిగినట్టే అని ప్రతీ ఆటగాడు భావిస్తారు. అలాంటి జట్టు ప్రస్తుతం అంతర్గత విభేదాలతో రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట టీమ్ మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయాలతో ఈ విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్.. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేసింది. అతడి కోసం గుజరాత్ టైటాన్స్ కు అనధికారికంగా చాలా డబ్బును ఇచ్చింది.
హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్న వెంటనే తమ సారథిగా ప్రకటించింది. టీమ్ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు విజేతగా నిలబెట్టిన ఆ జట్టు మాజీ కెప్టెన్, టీమిండియా సారథి రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇది అవమానంగా భావించారు. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ వాళ్లు ముంబై ఫ్రాంచైజీపై విమర్శలు గుప్పించారు. కొందరైతే ఆ జట్టు సోషల్ మీడియా పేజీలను అన్ ఫాలో చేశారు. అయినా ఆ జట్టు మేనేజ్ మెంట్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
రోహిత్ శర్మ భార్య రితికా, స్టార్ పేసర్ బుమ్రా సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతించలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. సూర్యకుమార్ యాదవ్ ‘గుండె పగిలింది’ అని కామెంట్ చేశాడు.
ఈ క్రమంలోనే ముంబై టీమ్.. రోహిత్ వర్సెస్ హార్దిక్ గా విడిపోయినట్టు అర్థమవుతోంది. రోహిత్, సూర్య, బుమ్రా ఒక టీమ్ గా ఉండగా.. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ తదితర ఆటగాళ్లు మరో టీమ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు ఇషాన్ కిషన్ క్లోజ్ గా ఉండడం నచ్చకనే రోహిత్.. జితేశ్ శర్మను తీసుకొచ్చి తుది జట్టులో చోటు లేకుండా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ విభేదాలు త్వరలో జరుగబోయే జట్టు ఆటపై ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.