Mumbai Indians : రోహిత్ స్థానంలోకి హార్థిక్.. కారణం చెప్పిన ముంబై ఇండియన్స్ కోచ్..
Mumbai Indians : ముంబై ఇండియన్స్ కేప్టెన్సీలో మార్పు నిర్ణయం ఐపీఎల్ క్రికెట్ లో పెను తుపాను సృష్టించింది. ఇప్పటి వరకు జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కాదని హార్థిక్ పాండ్యాను సారథిగా నియమించడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రీసెంట్ గా ఈ అంశంపై జట్టు కోచ్ మార్క్ బోచర్ స్పందించారు. మార్పు వెనుక కారణాన్ని వివరించారు.
ఓ క్రీడా ఛానల్ పాడ్‌కాస్ట్‌లో ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ దీనిపై స్పందించారు. ‘ఇది ఆట పరంగా తీసుకున్న నిర్ణయమే. నా వరకు ఇది పరివర్తన దశ మాత్రమే. ఈ విషయం చాలా మందికి అర్థంగాక, భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, ఆటకు సంబంధించి భావోద్వేగాలను పక్కన పెట్టాలి. ఓ ఆటగాడిగా రోహిత్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుంది. కేప్టెన్సీ లేకపోవడంతో అతడు మరింత స్వేచ్ఛగా ఆడి మంచి పరుగులు సాధించనివ్వండి’ అన్నారు.
ఐపీఎల్‌లో క్రికెటేతర బాధ్యతలు కూడా కెప్టెన్సీ మార్పునకు మరో కారణం అని మార్క్ వెల్లడించారు. ‘గత 2 ఐపీఎల్ సీజన్లలో రోహిత్ బ్యాట్‌తో రాణించలేదు. అందుకే ఆయన భూజాలపై ఉన్న కేప్టెన్ అనే బాధ్యతలను దించాలనుకుంటున్నాం. లీగ్ టోర్నీలో కెప్టెన్‌కు ఆట కాకుండా చాలా బాధ్యతలు ఉంటాయి. ఫొటో షూట్స్ ప్రకటనల వంటివి కూడా చూసుకోవాలి’ అని మార్క్ వెల్లడించారు.
ఈ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూపై రోహిత్ సతీమణి రితికా విమర్శనాత్మక పోస్ట్ చేశారు. ‘దీని వల్ల చాలా తప్పిదాలు జరిగాయి’ అంటూ ఆమె పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీసింది.