MI Vs CSK : ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం సాయంత్రం హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ లో ఎక్కువ మంది చూసే మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే ఫ్యాన్స్ కు పండగే. రెండు జట్లు హోరాహోరీగా తలపడడం.. మ్యాచ్ లు ఆద్యంతం ఉత్కంఠ సాగుతుంటాయి.
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ అయిదు సార్లు టైటిల్ అందించాడు. అందులో చెన్నై పై ఫైనల్లో గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి రెండు జట్లు ఈ సారి నూతన కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. అటు రోహిత్, ఇటు దోని ఇద్దరు కేవలం ఆటగాళ్లుగా మాత్రమే బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 36 సార్లు తలపడగా.. ముంబయి 20 సార్లు చెన్నై 16 సార్లు గెలిచింది.
ముంబయి ఇండియన్స్ పై గత సీజన్ లో రెండు సార్లు చెన్నై గెలిచింది. ముంబయి ఇండియన్స్ ఎప్పటి లాగే అన్ని సీజన్ల లాగానే మొదటి మ్యాచ్ లో ఓడిపోయింది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయిన ముంబయి మళ్లీ గెలుపు బాట పట్టింది. ప్రస్తుతం వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదుంది. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. జస్ ప్రీత్ బుమ్రా అయితే ఏకంగా ఆర్సీబీతో 5 వికెట్లు పడగొట్టి దుమ్ము రేపాడు. మిగతా బౌలర్లు తేలిపోతున్నా తను మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి భారీ ఇన్సింగ్స్ ఆశిస్తోంది. ఇంఫాక్ట్ ప్లేయర్ గా వస్తున్న శివమ్ దూబె సిక్సుల మోత మోగిస్తుండగా.. తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్నాడు. అయితే బ్యాటింగ్ లో రచిన్ రవీంద్ర , డెరెల్ మిచెల్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. దోని బ్యాటింగ్ కు ఎప్పుడు వస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ హై హోల్టేజ్ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.