MS Dhoni : కెప్టెన్సీ పగ్గాలు వదులుకున్న ధోనీ..కుర్రాడికి బాధ్యతలు..షాక్ లో మిస్టర్ కూల్ ఫ్యాన్స్
MS Dhoni : మరికొద్ది గంటల్లోనే ఐపీఎల్-2024 సీజన్ 17 ప్రారంభం కాబోతోంది. శుక్రవారం జరుగబోయే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనున్నాయి. హోమ్ గ్రౌండ్ లో సొంత అభిమానుల మధ్య ఆర్సీబీని ఓడించాలని సీఎస్కే ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు. ఇంతలోనే షాకింగ్ న్యూస్.. సీఎస్కే జట్టు కెప్టెన్ నే మార్చేసింది. సారథిగా ఎంఎస్ ధోనీ స్థానంలో కుర్రాడైన రుతురాజ్ గైక్వాడ్ కు పగ్గాలు అందించింది.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ఘనత ధోనీది. 2008లో జట్టు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న ధోనీ ఇప్పటివరకూ అదే ఫ్రాంచైజీకి ఆడారు. మధ్యలో రెండు సంవత్సరాలు చెన్నై జట్టును నిషేదించడంతో రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ తరుఫున ఆడాడు. 2023 సీజన్ లో అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చెన్నై రికార్డు స్థాయిలో 5వ సారి టైటిల్ ను గెలుచుకుంది. సీఎస్ కే ఇంత క్రేజ్ ఉందంటే దానికి కారణం ధోనీ మాత్రమే. కెప్టెన్ గా ఆయన వ్యూహాలే జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లకు రిటైర్ మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. ఆటగాడుగా మాత్రమే కొనసాగనున్నాడు.