MP Sudha Murthy : రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి తొలి ప్రసంగం.. పీఎం మోదీ ప్రశంసలు

MP Sudha Murthy
MP Sudha Murthy : పుస్తక రచయిత్రి, దాత, ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఎంపీగా రాజ్యసభలో తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యం అంశంపై ఆమె ప్రసంగించారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. బుధవారం (జులై) రాజ్యసభకు వచ్చిన పీఎం సుధామూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇటీవల సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె సభలో మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. ఆ వ్యాక్సిన్ ను తీసుకుంటే క్యాన్సర్ ను అడ్డుకోవచ్చని అన్నారు. చికిత్స కంటే నివారణే మేలని చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి చెప్పిన మాటలను సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబంలో తల్లి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అది తీరని లోటని అన్నారు. కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని, ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్ ను బాలికలకు అందించడం సులభమని అన్నారు. దీంతో పాటు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు.
సుధామూర్తి చేసిన ఈ ప్రసంగంపై ప్రధాని స్పందించారు. మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తిజీకి కృతజ్ఞతలని అన్నారు. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసిందని, గర్భిణీలకు వ్యాక్సినేషన్ తీసుకు వచ్చామని వెల్లడించారు.