Double Ismart : మూవీ రివ్యూ:  డబుల్ ఇస్మార్ట్ హిట్టా..ఫట్టా.

Double Ismart

Double Ismart

Double Ismart : ఒక అడుగు వెనుకకు వేస్తే  పదడుగులు వెనుకకు వేయగల సత్తా ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్. పూరీ చూడని ప్లాఫ్ లేదు.. పూరీ చూడని సక్సెస్ లేదు. కానీ పూరీ అంటే నిర్మాతలకు ఎక్కడో చిన్న నమ్మకం. హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ తీసుకురాగల దర్శకుడు. కానీ ఒకప్పటి స్పార్క్ పూరీలో మిస్సవుతున్నట్లు అనిపిస్తుంది. పూరీ జగన్నాథ్ లేటెస్ట్ ప్రాజెక్టు డబుల్ ఇస్మార్ట్.

రామ్, పూరి కాంబినేషన్ లో చేసిన తొలి సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇది సూపర్ హిట్టవ్వడంతో సీక్వెల్ ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు.  ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియెన్స్‌ ని బాగా పట్టేసింది. ఈ డబుల్ ఇస్మార్ట్ కూడా అలానే హిట్  కొట్టిందా? పూరి, రామ్‌కి మరో బ్లాక్ బస్టర్ వచ్చిందా? నిర్మాతగా ఛార్మి దశ తిరుగుతున్నదా? అన్నది చూద్దాం.

ఇదీ కథ..
బిగ్ బుల్ (సంజయ్ దత్) తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండడతో, మూడు నెలల్లో చనిపోతాడనే విషయం తెలుస్తుంది. ఎలాగైనా తాను చిరకాలం బతకాలని కోరిక ఉంటుంది. దీని కోసం తన మెమొరీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని)కి ఆల్రెడీ మెమొరీ ట్రాన్స్‌ఫర్మేషన్ విజయవంతమైందని, అతనిలోకి తన మెమొరీని తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఇస్మార్ట్ శంకర్ రూపంలో మళ్లీ తాను బతకాలని కోరుకుంటాడు బిగ్ బుల్. ఇక ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్‌ను పంపిస్తాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్‌ డబ్బును  కొల్లగొడుతుంటాడు. ఈ క్రమంలో జన్నత్ (కావ్యా థాపర్) కూడా ఇస్మార్ట్ శంకర్‌తో చేయి కలుపుతుంది. మరో వైపు ఇస్మార్ట్ శంకర్ కూడా తన టార్గెట్ బిగ్ బుల్ అని అంటుంటాడు.  ఇస్మార్ట్ శంకర్‌కు తన మోమొరీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలు ఏంటి? ట్రాన్స్‌ఫర్మేషన్ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా చేసిన ప్రయత్నాలు ఏమిటి? జన్నత్ పాత్ర ఎంట్రీకి కారణాలేంటి? పోచమ్మ (ఝాన్సీ) కారెక్టర్‌ ప్రాధాన్యం ఏంటి? చివరకు ఏం జరుగుతుంది అనేది మిగతా కథ.

లైగర్ ప్లాఫ్ తో ఫామ్ కోల్పోయాడు పూరి జగన్నాథ్. మళ్లీ హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ పట్టాలని ఈ ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకున్నాడు.  ఇస్మార్ట్ శంకర్ ప్రధాన బలం మాస్ సినిమా కావడం, అందులో రామ్ ఎనర్జీ, సినిమా చివరి ఎక్కడా బోర్ కొట్టని కథనం, పూరీ మార్క్ డైలాగ్స్, మణిశర్మ అద్భుతమైన మాస్ బీట్ సాంగ్స్, రామ్ డ్యాన్సులు, ఫైట్లతో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, నటా నటేష్ అదనపు ఆకర్షణ.  మాస్ పల్స్ కి అద్దం పట్టింది ఇస్మార్ట్ శంకర్. పూరీ మార్క్ ఎలా ఉంటుందో ఆ సినిమా చూపెట్టింది.

అదే కథను కొంచెం అటు ఇటు చేసి డబల్ ఇస్మార్ట్ సినిమాను చుట్టేశారు. పూరి మార్క్ మాత్రం డబుల్ ఇస్మార్ట్ లో మిస్సయ్యింది. తనకు అచ్చొచ్చిన అలీతో చేయించిన బోకా కామెడీ ట్రాక్ బాగా విసిగించేసింది. పూరీ-అలీ కామెడీ ట్రాక్ ను ఆడియెన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలీ ఉండాలనే సెంటిమెంట్ తో తప్ప  సీరియస్ గా ఆ పాత్రను రాయలేదేమోనని అనిపిస్తుంది.  ఇక దాదాపు ప్రతి సినిమాలో ఎక్కడో ఒక చోట హీరోకు మదర్ సెంటిమెంట్ జోడిస్తుంటాడు పూరి. ఇందులోనూ అలాగే చేశాడు.

పూరి సరైన కథను గానీ, కథనాన్ని కూడా పకడ్బందీగా  రాసుకున్నట్లు కనిపించలేదు.  ఇస్మార్ట్ శంకర్ స్థాయిలో పాటలు మాత్రం ఇందులో కనిపించలేదు.  పూరీ ఇక తన రెగ్యులర్ ఫార్మాట్ లోనే నాలుగు ఫైట్లు.. ఓ ఐటం సాంగ్.. ఓ రొమాంటిక్ సాంగ్.. పది మాస్ డైలాగ్స్ ని లెక్కేసి పెట్టుకున్నాడు.

రామ్ వన్ మాన్ షో
డబుల్ ఇస్మార్ట్ లో రామ్ వన్ మాన్ షోగా సాగింది. రామ్ తెలంగాణ యాసను పూర్తి స్థాయిలో పట్టుకోలేకపోయాడు. హీరోయిన్ కావ్యా థాపర్‌ను పాటల కోసం తీసుకున్నట్లు అనిపిస్తుంది. సంజయ్ దత్ తన స్థాయికి తగ్గట్టు చేయలేపోకపోయాడు. గెటప్ శ్రీను, టెంపర్ వంశీ ఓకే.

పవర్ ఫుల్ డైలాగ్స్..
పూరి టెక్నికల్‌ నాలెడ్జ్ బాగుంటుంది. అదీ ఇందులో కనిపించింది. పూరీ డైలాగులు డైనమైట్ లాంటివి. కొన్ని చోట్ల పవర్ ఫుల్ గా పడ్డాయి. చాలా చోట్ల మ్యూట్ చేసేశారు. సాంగ్స్ చిత్రీకరణలో పూరి పిక్చరైజేషన్ చాలా బాగుంది. పూరీ ముందుగా చెప్పినట్లు మాస్ సెంటర్లో ఆడియన్స్ సీట్లలో కూర్చోవడం కష్టమే. ఎగిరి గంతులేయక తప్పదు. కెమెరా లెన్స్, జూమ్ ను వాడుకోవడంలో రాంగోపాల్ వర్మ, కృష్ణ వంశీ తర్వాతే పూరీనే.  విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది.  ఇప్పటికైతే మాస్ ఆడియన్స్ కు సినిమా పట్టినట్లే. తెలుగుకు వాళ్లకు పూరి మార్క్ పాతదే అయినా.. నార్త్ లో మాత్రం కొత్తగా ఫీలవుతారు.  బాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం డబుల్ ఇస్మార్ట్ కు ప్లస్. కలెక్షన్ల పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. పూరీ కమ్ రామ్ కు ఈ తరహ సినిమాలు కొత్తేమీ కాదు. వాళ్లను అభిమానించే వాళ్లకు మాత్రం మాస్ ట్రీట్ అని చెప్పక తప్పదు.

కాస్టింగ్: రామ్‌ పోతినేని, సంజయ్‌ దత్‌, కావ్యా థాపర్‌, సాయాజీ షిండే, అలీ, గెటప్‌ శ్రీను, టెంపర్ వంశీ తదితరులు
నిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్‌
నిర్మాతలు: పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌
దర్శకత్వం:పూరీ జగన్నాథ్‌
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సామ్‌ కె. నాయుడు, జియాని జియానెలి
విడుదల తేది: ఆగస్ట్‌ 15, 2024

రేటింగ్ : 3/5

-అజయ్ యాదవ్

TAGS