Allu Arjun : సినీ నటుడు అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట
Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఏపీలోని నంద్యాల పోలీసులు టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం (అక్టోబరు 25) విచారణ జరుగగా.. అల్లు అర్జున్ కు భారీ ఊరటనిచ్చింది ధర్మాసనం. ఈ కేసుపై నవంబరు 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుపై నవంబరు 6న తదుపరి ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వచ్చారు. వైసీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిల్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయన్ను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులు లేకపోయినా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డిలపై అప్పట్లో నంద్యాల రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.