Garbage : తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన తల్లి, కూతురు కొన్నేళ్లుగా ఇంట్లోనే ఉన్నారు. డంపింగ్ యార్డుగా మారిన ఇంట్లోనే నివసిస్తున్నారు. దుర్వాసన వస్తున్నా లెక్కచేయకుండా అక్కడే తిని పడుకుంటున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? వారికి ఏమైందో తెలుసుకుందాం..కోయంబత్తూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో రుక్మిణి తన భర్త, కుమార్తెతో కలిసి నివాసం ఉండేవారు. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందినట్లు తెలుస్తోంది. భర్త చనిపోయిన తర్వాత రుక్మిణిని చూసేందుకు బంధువులెవరూ రాలేదు. ఆ సమయంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. అప్పటి నుంచి రుక్మిణి, ఆమె కూతురు ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. వారికి ఇష్టమైన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేవారు. కొన్నిసార్లు ఇంట్లోనే వండుకునే వారు. రుక్మిణి భర్త రిటైర్డ్ టీచర్. ఆయన మరణంతో రుక్మిణికి పింఛను వస్తోంది. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు చేసేవారు. రుక్మిణి, ఆమె కూతురు అప్పుడప్పుడు చూసేవాళ్లమని ఇరుగుపొరుగు వారు తెలిపారు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం బాక్స్‌లు, కవర్‌లలో వస్తుంది. భోజనం చేసి కవర్లు, బాక్సులను ఇంట్లోనే వదిలేశారు. దీంతో ఇళ్లలో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయి డంపింగ్ యార్డుగా మారింది. రుక్మిణి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు ఏరే నెంజమ్ ఫౌండేషన్‌కు చెందిన మహేంద్రన్‌ను సంప్రదించారు. రుక్మిణి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. చాలా ప్రయత్నాల తర్వాత రుక్మిణి ఇంట్లోకి వెళ్లారు. ఒక్కసారిగా గుప్పుమని దుర్వాసన వచ్చింది. ఇంట్లో ఆహార ప్యాకెట్లపై పురుగులు, బొద్దింకలు ఉన్నాయి. మహేంద్రన్ వెంటనే సెల్ ఫోన్ లో వీడియో తీసి కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కార్పొరేషన్ అధికారులు రుక్మిణి ఇంట్లో ఉన్న 4 వేల కిలోల చెత్తను పారిశుధ్య కార్మికులతో తొలగించారు. ఇంటిని కూడా శుభ్రం చేశారు.