Papua New Guinea : పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా మృతి చెందినట్లు ఆస్ట్రేలియా అధికారిక మీడియా ప్రకటించింది. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కి.మీ.ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావన్స్ లోని కావోకలం అనే గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు కొండ చరియలు విరిగి గ్రామంపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రాణ నష్టం భారీగా ఉంది.
శిథిలాల కింద ఉన్నవారి కోసం గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని స్థానికులు తెలిపారు. ఈ గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని సమాచారం.