Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రమంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
రుతుపవన ఆరంభ కాలం కాబట్టి వర్షానికి ముందు, వర్షం కురిసే సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు వస్తాయని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.