Money Caught In Telangana Elections : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి గెలుపే లక్ష్యంగా నాయకులు పావులు కదుపుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి నేతల హడావుడి మొదలైంది. టికెట్ల కోసం భేర సారాలు, టికెట్ కేటాయించకపోవడంతో పార్టీలు మారడం, జీవితాంతం పని చేసిన పార్టీపై దుమ్మెత్తిపోయడం, రాజకీయ ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా సొంత పార్టీ ఓటమి కోసం పని చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా నాయకులు, పార్టీల వైపు ఉంటే.. మరో వైపు అధికారులు ఎన్నికలు సజావుగా జరిగేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం తనిఖీలు, ప్రదేశాలను మానిటరింగ్ చేస్తూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా చూస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు పండుగలు, దసరా, దీపావళి ఈ ఎన్నికల షెడ్యూల్ లోనే రావడంతో మాంసం, మద్యం, దీపావళికి మందుగుండు సామగ్రి అందజేస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వీటితో పాటు ఒక్కో నియోజకవర్గంలో కార్యకర్తలు, ఓటర్ల కోసం మందు పార్టీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇవి వివాదాలకు దారి తీశాయి.
ఓటర్లను డబ్బు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తారని ఎన్నికల కమిషన్ ఎన్నికల వేల తనిఖీలను ముమ్మరం చేస్తుంది. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. కోడ్ అమల్లో ఉండగా రూ. 50 వేలకు మించి డబ్బు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. దీంతో ఎక్కువ తీసుకెళ్తే మొదట సీజ్ చేస్తారు. సంబంధిత పత్రాలు చూపిస్తే డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. అయితే తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.659.2 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో మొత్తం రూ.1,760 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.