Money Elections 2024 : ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు.. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ సమానమే.. ప్రజాస్వామ్యంలో పేదవాడు కూడా ప్రధాని కావొచ్చు..’’ ఇవన్నీ వినిపించే నీతిసూక్తులు. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. కానీ ఆచరణలోనే తెలిసిపోతుంది ఉత్తమాటలే అని. భారత్ లాంటి దేశంలో ప్రజాస్వామ్యం ఉంది నిజమే. కానీ ఆ ప్రజాస్వామ్యంలో పేదోడికి దక్కేది రిక్తహస్తమే. ఎన్నికల్లో నిల్చుని గెలిచి ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో అయ్యే అవకాశాలు ఇప్పట్లోనైతే లేవు. గాంధీ, నెహ్రూ టైంలో ఉండేవేమో కావొచ్చు కానీ.. ప్రస్తుత ఎన్నికల్లో గాంధీ, సుభాష్ చంద్రబోస్ వచ్చి రూపాయి ఖర్చు పెట్టకుండా గెలవడం చాలా కష్టం. అలా మారిపోయింది మన ఎన్నికల ప్రక్రియ.
దేశంలో రాజకీయాలంటే అక్రమార్జనకు ఓ వేదిక. సంపాదించుకోవడానికి, సంపాదించుకున్నది కాపాడుకోవడానికి ఉపయోగపడేవే రాజకీయాలు. అందుకే రాజకీయాలు మొత్తం డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే రాజకీయ పార్టీలు కూడా సంపన్నులకే సీట్లు ఇస్తాయి తప్ప డబ్బులు లేని వ్యక్తులను కనీసం పట్టించుకోవు. పార్టీ కోసం తన శక్తిని అంతా ధారపోసే కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వరు. వారి జీవితమంతా పార్టీ కోసం పనిచేయడమే. వీరు చెమటోడ్చితే సంపన్నులు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి తమ సంపాదనను మరింత పెంచుకుంటారు. వీళ్లకు సిద్ధాంతాలు, మన్నుమశానం ఏమి ఉండవు. ఏ పార్టీ గెలిస్తే అందులోకి వెళ్లడమే. వాళ్లకు కావాల్సింది అధికారం మాత్రమే.
అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల కోసం ఏపీలోని పార్టీలన్నీ సిద్ధమైపోయాయి. ఎన్నికలు సమీపించడంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పార్టీలన్నీ సంపన్నులకే సీట్లు కట్టబెట్టాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన..ఇలా అన్ని పార్టీలు సంపన్నులకే సీట్లు కట్టబెట్టాయి తప్పా ఏ ఒక్కరూ పార్టీ కోసం పనిచేసిన అహర్నిషలు పనిచేసిన వ్యక్తులకు సీట్లు ఇవ్వలేదు.
కోట్లు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసే వీరు..రేపటి ఎన్నికల్లో గెలిస్తే తాము పెట్టిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి భూకబ్జాలు, సెటిల్ మెంట్లు, ఇసుక దందాలు చేయరా అని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సంపన్నులకే మేలు చేస్తుంది తప్పా..పేదవాడు ప్రజాప్రతినిధి కావడం కలగానే మిగలనుంది.