AP News : చంద్రబాబుకు మోడీ షాక్.. జగన్ మాటకే సై
AP News : రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ పేరు దేశంలోనే అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంటోంది!. టీడీపీ హయాంలో రాజధానిగా గుర్తించిన అమరావతిని కాదని ప్రస్తుత జగన్ సర్కార్ మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ఇది ఎంతకు తెమలకపోవడంతో ఇప్పటికీ ఏదీ రాజధానో జనాలకు, ఇటు పాలకులకు తెలియకుండానే ఐదేండ్లు గడిచిపోయాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండడంతో పార్టీలన్నీ ఆ హడావిడిలోనే ఉన్నాయి. ఎన్నికల్లో రాజధాని విషయం ప్రధానంగా ఉండబోతోంది. టీడీపీ, జనసేన కూటమి వర్గాలు అమరావతే రాజధానిగా చెబుతున్నాయి. అధికారంలోకి వస్తే అమరావతిని ఇతర రాజధానులకు దీటుగా తయారుచేస్తామని అంటున్నాయి. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం రాజధాని పేరే ఎత్తడం లేదు.
ఇదిలా ఉండగా ఏపీలో మూడు రాజధానుల కారణంగా ప్రస్తుత రాజధాని అమరావతికి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇప్పుడు విశాఖకు తరలిపోతోంది. రాజధాని ఏర్పాటు కాకపోయినా భవిష్యత్ అంచనాలతో అమరావతిలో భూకేటాయింపులను కూడా కాదని విశాఖకు వెళ్లేందుకు ఆర్బీఐ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
గత చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా కేంద్రం గుర్తించాక ఇక్కడ రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధమైంది. దీంతో టీడీపీ ప్రభుత్వం ఏకంగా 11 ఎకరాల భూమిని అమరావతిలో కేటాయించింది. ఇందులో ప్రాంతీయ కార్యాలయం మాత్రం ఏర్పాటు కాలేదు. ఆలోపు ప్రభుత్వం మారడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, దాంతో పాటే మూడు రాజధానులు తెరపైకి రావడంతో ఆర్బీఐ డైలమాలో పడింది.
చివరకు జగన్ సర్కార్ ప్రతిపాదిస్తున్న భవిష్యత్ రాజధాని విశాఖకు మారేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. విశాఖలో తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం భూమి లేదా భవనాలు కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం 30 నుంచి 35 వేల చదరపు అడుగుల భవనాలను గుర్తించాలంటూ ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందాయి. ఇప్పుడు ఆ భవనాల అన్వేషణలో అధికారులు బిజీగా ఉన్నారు.
అమరావతిని రాజధానిగా ప్రతిపాదిస్తున్న చంద్రబాబుకు ఆర్బీఐ నిర్ణయం ఓ రకంగా షాక్ వంటిదే. త్వరలోనే ఎన్డీఏ కూటమిలోకి వెళ్తున్న చంద్రబాబు కంటే.. కేంద్ర సర్కార్ జగన్ ప్రతిపాదించిన విశాఖకే ప్రాధాన్యమిచ్చి ఆర్బీఐ రీజినల్ ఆఫీస్ ను అక్కడ ఏర్పాటు చేయడం గమనార్హం. భాగస్వామ్య పార్టీ నేత మాటకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రత్యర్థి పార్టీ నేత, సీఎం జగన్ మాటకే ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఆలోచించదగ్గదే. వాస్తవానికి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు రాజధాని నగరాల్లోనే ఉంటాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే..ఆర్బీఐ నిర్ణయాన్ని తిరస్కరిస్తారా? ఏం చేస్తారు? అనేది భవిష్యత్ లోనే తేలనుంది. ఒకవేళ మళ్లీ జగనే వస్తే మాత్రం ఆర్బీఐ కార్యాలయం విశాఖలోనే ఉండనుంది.