Priyanka Gandhi : మోదీగారూ.. ఇందిరాగాంధీ లక్షణాలు నేర్చుకోండి: ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : మోదీ తనను దుర్భాషలాడారంటూ కన్నీరు పెట్టుకోవడానికి బదులు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని ప్రియాంకగాంధీ సూచించారు. మహారాష్ట్రలోని నందుర్బార్ లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ప్రియాంకగాంధీ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగాలను డొల్ల మాటలుగా పేర్కొన్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను బీజేపీ గౌరవించడం లేదని ఆరోపించారు. రాజకీయాలు ప్రజలకు సేవ చేసే మాధ్యమమని, మోదీ మాత్రం అధికారం సంపాదించుకునే సాధనంగా మలుచుకున్నారని విమర్శించారు.
‘‘ప్రచారంలో ప్రధాని మోదీ గారడీ మాటలు చెప్తున్నారు. తాను శబరీని గౌరవిస్తానని చెప్పారు. అయితే, ఉన్నావ్, హాత్రాస్ లలో అనేకమంది మహిళలు దౌర్జన్యానికి గురైనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు.? లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన చేపట్టినప్పుడు ఎందుకు స్పందించలేదు? పైగా నిందితుడి కుమారుడికి టికెట్ ఇచ్చారు’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.
నందుర్బార్ తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రియాంక గుర్తు చేసుకున్నాను. ఇందిరాగాంధీ తన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలుపెట్టే వారన్నారు. ప్రజలను ఎలా గౌరవించాలో ఆమె నుంచే తన తల్లి సోనియాగాంధీ నేర్చుకున్నారని చెప్పారు. ‘‘ప్రజల కష్టాలు వినడానికి బదులు.. తనను టార్గెట్ చేశారంటూ ఎన్నికల వేళ మోదీ వాపోతున్నారు. తనను దుర్భాషలాడారంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు. ఇది ప్రజాజీవితం. పాకిస్థాన్ ను రెండుగా విడగొట్టిన ఇందిర నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను నేర్చుకోండి’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు.