Lok Sabha : ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని మోదీ సర్కార్‌తో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి అనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే… ఇది పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధమని… ఎన్డీయే కూటమితో వైసీపీకి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని ఆ పార్టీ నేతలు చెప్పేవారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు పలికేవారు. దీన్నిబట్టి… అప్పటి నుంచి జగన్ మోడీకి రహస్య మిత్రుడంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు ఏపీలో మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ కేంద్రంలో మోడీకి మద్దతు పలుకుతున్నారనే మాట వినిపిస్తోంది. దీంతో…ఏపీలో ఎన్డీయేకు 25 ఎంపీ బలం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో.. లోక్ సభలో మోడీకి వైసీపీ షాక్ ఇచ్చింది. . లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో 11 మంది ఎంపీలు కలిగిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇప్పుడు ఓ కీలక బిల్లుకు అడ్డుపడింది.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే… ఈ బిల్లును వైసీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా… బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లింల అభిప్రాయాలను పరిశీలించాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లింల అభిప్రాయాలు తీసుకోవాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించిన అభిప్రాయాలతో వైసీపీ కూడా ఏకీభవించింది. దీంతో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులను వైసీపీ వ్యతిరేకించడం ఖాయమనే చర్చ మొదలైంది.
ఇక… ఈ బిల్లును వైసీపీతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించగా… టీడీపీ, జేడీయూ, ఏఐఏడీఎంకే పార్టీలు మద్దతు పలికాయి. కాగా, ఈ వక్ఫ్ బిల్లుపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్నారు. అదే సమయంలో… ఈ బిల్లు ఆర్టికల్ 25ను ఉల్లంఘించేలా ఉందని.. అదేవిధంగా… వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యకలాపాలకు ఉద్దేశించినవే. ఈ నేపథ్యంలో అల్లా పేరు మీద ఆస్తులను విరాళంగా ఇవ్వకుండా చేశారని ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై ముస్లింల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఒవైసీ వ్యాఖ్యలతో ఏకీభవించిన వైసీపీ.. ఈ బిల్లును వ్యతిరేకించింది. దీంతో… మోడీతో విభేదిస్తున్నట్లు కాకపోయినా, అనుకూలిస్తున్నట్లు మాత్రం లేమనే హింట్ ఇచ్చారనే వ్యాఖ్యలు మొదలయ్యాయి!