Modi Permanent PM : మోదీ శాశ్వత ప్రధాని..? ఇవే చివరి ఎన్నికలు? ఖర్గే సంచలన వ్యాఖ్యల్లో అంతర్యమిదే!
Modi Permanent PM : ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రాముడు..ఈ రెండు దేశంలోని మెజార్టీ ప్రజల ఆకాంక్షలు. వీటిని మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయవంతంగా నెరవేర్చగలిగింది. 2014 నుంచి ఇప్పటివరకూ బీజేపీ విజయప్రస్థానం సాగుతోంది. ఇదే హవాను రాబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ చూపించాలని బీజేపీ తహతహలాడుతోంది. 400 సీట్లపైబడి సీట్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని గట్టిగానే ఫిక్స్ అయ్యింది. అందుకే ఇప్పటికే రాజకీయంగా ఏం చేయాలో అది చేస్తూనే ఉంది. ఇటు రాజకీయం, అటు ఆధ్యాత్మికం రెండింటిని కలగలిపి ప్రజలను, నేతలను తన వైపు తిప్పుకుంటోంది. మూడోసారి గెలుపు ఖాయమనే ధీమాతో ముందుకెళ్తోంది.
ఈక్రమంలో ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ ట్రాప్ లో పడిపోతున్నాయి. బీజేపీని గద్దె దించడమనేది కాంగ్రెస్ ఒక్క పార్టీతో సాధ్యమయ్యే పని కాదని తెలిసిపోయింది. బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తేనే బీజేపీని ఏమైనా ఎదుర్కొనగలవు. ఇది వారికి కూడా తెలుసు. అయినా ప్రతిపక్ష కూటమిలో సయోధ్య లేదు. నిన్ననే నితీశ్ కుమార్ కాంగ్రెస్, ఆర్జేడీలకు ఝలక్ ఇచ్చి బీజేపీతో దోస్తీ కట్టి 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికలకు రెండు నెలలు కూడా లేదు. ప్రతిపక్ష కూటమిలో ఇంతవరకు బీజేపీని ఎలా ఎదుర్కొవాలో వ్యూహరచన లేదు. సీట్ల పంపకాలు లాంటి విషయాలు ఇంకా ఆలోచనే చేయడం లేదు. అసలు అందులో ఎవరుంటారో..ఎవరు వెళ్తున్నారో వారికే అర్థం కావడం లేదు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ప్రధానిగా మోదీ గెలిస్తే.. దేశానికి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించారు. బీజేపీ మరోసారి గెలిస్తే మోదీ నియంతృత్వం వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. రష్యాలో పుతిన్ పాలించినట్లుగా ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలకు ఇదే చివరి అవకాశమని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్- బీజేపీ సిద్ధాంతాలు విషపూరితమైనవని, అందువల్ల వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రతిపక్షాలను బెదిరించడం ద్వారా మోదీ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు.
ఖర్గే వ్యాఖ్యలను బట్టి మోదీ గెలిస్తే ప్రతిపక్షాలను తమ గుప్పిట పెట్టుకునే అవకాశం ఉందని, ముఖ్యంగా కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తారనే ఆందోళన కలిగిస్తుంది. అయితే ఏ దేశంలోనైనా నియంతృత్వ పాలన పోకడలు మంచివి కావనే చెప్పవచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన నడువాలి. ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అనుభవించాలి. అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజలు ఎప్పుడూ తమకు మంచి చేసే వారినే కోరుకుంటారు. దీన్ని ప్రతిపక్షాలు కూడా గమనించి ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నించాలి. వారిలో మంచి పాలన అందిస్తామనే విశ్వాసాన్ని పాదుగొలపాలి.