Modi Laddu : దీపావళికి ‘మోదీ లడ్డూ’.. గంగాజలంతో తయారీ
Modi Laddu : పీఎం మోదీపై అభిమానంతో ఓ స్వీట్ దుకాణం వ్యాపారి తాను తయారు చేసే లడ్డూలకు ఆయన పేరు పెట్టి గత పదేళ్లుగా విక్రయిస్తున్నారు. బీహార్ లోని సంజీవ్ శర్మ ఓ స్వీట్ షాప్ వ్యాపారి. ఆయనకు మోదీ అంటే ఎంతో అభిమానం. దీంతో మోదీ మొదటిసారిగా పీఎంకా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాయల్ లడ్డూలకు ‘మోదీ లడ్డూ’ అని పేరు పెట్టాడు. ఈ లడ్డూలతో సంజీవ్ శర్మకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ దీపావళికి మోదీ లడ్డూలను మరింత ప్రత్యేకంగా చేయాలనుకున్నారు. అందుకనే దీపావళి సందర్భంగా తయారుచేసే లడ్డూలలో పవిత్రమైన గంగాజలాన్ని కలుపుతున్నట్లు ఆ వ్యాపారి పేర్కొన్నారు.
మోదీ లడ్డూల తయారీలో దేశీయంగా తయారైన నెయ్యి, కుంకుమ పువ్వు, బాదం, పిస్తాలను వినియోగిస్తున్నట్లు సంజీవ్ శర్మ తెలిపారు. పీఎం మోదీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు కాబట్టి.. ఈ దీపావళికి ప్రత్యేకంగా పవిత్రమైన గంగాజలంతో మోదీ లడ్డూలను తయారు చేస్తున్నామని వివరించారు. ఈ లడ్డూలతో గంగా, యమున, సరస్వతి నదుల నాగరికత చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయాలనేది తన ఉద్దేశమని సంజీవ్ శర్మ పేర్కొన్నారు.