Modi : తన రికార్డునే తానే బద్దలు కొట్టిన తొలి ప్రధాని మోడీ
PM Modi : దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రసంగించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రేంజ్ రోవర్ సెంటినెల్, ఫార్చ్యూనర్ కార్ల కాన్వాయ్ తో ప్రధాని ఎర్రకోటకు చేరుకున్నారు. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక దుస్తులు ధరించారు. తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్‌గాలా జాకెట్, తలపై లేత నారింజ, పసుపు, ఆకుపచ్చ వర్ణాలు కలిసిన లెహెరియా తలపాగాతో ప్రధాని ప్రత్యేకంగా కనిపించారు.
78వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎక్కువ సార్లు ఎగురవేసిన మూడో ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత 11 సార్లు జాతీయ జెండా ఎగురవేసిన ప్రధానిగా మోదీ నిలిచారు. కాగా వరుసగా 11 ఏళ్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఇప్పటికే మోదీ నిలిచారు. ఈ సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. ‘భారత దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ యావత్ భారత్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసంగంతో ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత దేశ చరిత్రలోనే ఎర్రకోటపై అత్యధికంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి తన పేరుపై ఉన్న రికార్డును తానే తిరగ రాసుకున్నారు.
2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన మోదీ వరుసగా మూడోసారి కూడా ప్రధానిగా ఎన్నికయ్యారు. 2014లో ప్రధానిగా మోదీ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం 65 నిమిషాల పాటు చేశారు. 2015లో దాదాపు 88 నిమిషాలు, 2018లో 83 నిమిషాలు మోదీ ప్రసంగించారు. 2019లో మోదీ దాదాపు 92 నిమిషాలు మాట్లాడారు. 2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు, 2022 లో దాదాపు 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు.. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తన 11వ ప్రసంగంలో ఏకంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి తనకు ఎవరూ సాటి లేరని నిరూపించారు.
1947లో తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 72 నిమిషాలు, 1997లో ఐకే గుజ్రాల్ 71 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. నెహ్రూ, ఇందిర 1954, 1966లో కేవలం 14 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. ఇదే ఇప్పటికీ వరకు భారత ప్రధానులు అతి తక్కువ గా ప్రసంగించిన సమయంగా మిగిలిపోయింది.