RK Paluku : కేసీఆర్ ను నాశనం చేసేందుకు మోడీ రెడీ అయ్యాడట.. ఇదీ ఆర్కే పలుకు
RK Paluku : మూడో సారి గెలవడం పక్కా అనుకున్న గులాబీ బాస్ కు తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చి ఇంటికి సాగనంపారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలను కేసీఆర్ ఓ ఆటాడుకున్నారు. ఇక అన్ని పార్టీలు కలిసి బీఆర్ఎస్ తో ఆడుకునే రోజులొస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా లండన్ వేదికగా రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ను వంద అడుగుల లోతులో పాతి పెడుతామంటున్నారు. అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని చూస్తోంది.
బీజేపీతో పొత్తులు పెట్టుకుని పార్టీ ఉనికిని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని గతంలో కొత్త పలుకులో ప్రకటించిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈసారి బీజేపీ అలాంటి అవకాశాల్ని ఇవ్వడం లేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయాలని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకూ టాస్క్ ఇచ్చారట. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధానిని రేవంత్, భట్టి కలిశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సంగతి చూడడానికి తన మద్దతు ఉంటుందని చెప్పారని ఆర్కే అంటున్నారు.
బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడితే బలపడేది బీజేపీనే..అందులో సందేహం లేదు. అయితే బీఆర్ఎస్ ను బలహీనం చేయాలనుకుంటే బీజేపీనే చేయగలదు.. కాంగ్రెస్ నేతల్ని ఎందుకు ఎగదోస్తారన్నది ఇక్కడ కీలకం. తమ చేతికి మట్టి అంటకుండా పార్టీలను నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రయత్నిస్తుంటారని ఆర్కే ఉదాహరణలు చెప్పారు. జగన్ రెడ్డిని ప్రయోగించి చీఫ్ జస్టిస్ గా అవ్వాల్సిన ఎన్వీ రమణను ఎలా దారిలోకి తెచ్చుకున్నారో.. చంద్రబాబును కేసుల్లో ఇరికించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఆర్కే చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ టీడీపీని బలోపేతం చేశాయని అనుకున్న తర్వాత ఇక ఏపీ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా తెలంగాణ గురించి ఆలోచించడం బెటరని ఆ పని చేస్తున్నారట.
ఆర్కే చెప్పిన మరో విషయం ఏమిటంటే కేసీఆర్ దగ్గర డబ్బులు లేవట. లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొవడానికి అవసరమైన నిధులు కేసీఆర్ దగ్గర లేవట. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటున్నారు ఆర్కే. జాతీయ రాజకీయాలపై ఆశలతో ఇతర రాష్ట్రాల్లోని నేతలకు పంపారట. ఇప్పుడు తనకు సాయం చేసే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నారని అంటున్నారు. బలమైన అభ్యర్థులు లేక.. ఎవరు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. తన కుటుంబసభ్యులెవరూ పార్లమెంట్ కు పోటీ చేయకుండా కట్టడి చేస్తున్నారని కూడా అంటున్నారు. తన పార్టీకి వెయ్యి కోట్ల డిపాజిట్లు ఉన్నాయని కేసీఆర్ ప్రకటించారు. మరి డబ్బుల్లేవని ఆర్కేకు ఎందుకు అనిపించిందో? ఆయనకే తెలుసు.